Delhi Liquor Scam: మద్యం కేసు.. కేజ్రీవాల్‌ కెరీర్‌కు ఓ క్వశ్చన్‌ మార్క్‌

Delhi Liquor Scam: మద్యం కుంభకోణంలో దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కీలక కుట్రదారని ఈడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. 

Published : 11 Jul 2024 17:20 IST

దిల్లీ: ఆప్‌ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)పై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీ దిల్లీని గందరగోళ పరిస్థితిలోకి నెట్టివేసిందన్నారు. అలాగే మద్యంకేసు కేజ్రీవాల్ రాజకీయ భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చిందన్నారు.

మద్యం కుంభకోణంలో అందిన రూ.100 కోట్లలో కొంత భాగాన్ని కేజ్రీవాల్‌ స్వయంగా వాడుకున్నారని, ఆ నిధులతోనే గోవాలోని విలాసవంతమైన హోటల్‌లో బస చేశారని ఈడీ అభియోగపత్రం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంత్రి స్పందిస్తూ.. ఆ కేసు దిల్లీ సీఎం రాజకీయ కెరీర్‌కు ఓ క్వశ్చన్‌ మార్క్‌ పెట్టిందని విమర్శించారు. ఈ కుంభకోణంలో వారితో కాంగ్రెస్ కూడా చేరిందని, ఆ రెండు పార్టీలు కలిసి దిల్లీని దోచుకునేందుకు అవినీతి కూటమిని ఏర్పాటు చేశాయని దుయ్యబట్టారు. ఆప్‌ అరాచకపాలనతో దిల్లీ ప్రజలు విసిగిపోయారన్నారు.

గుట్టల్లా పోగుపడిన చెత్తను తొలగిస్తామని, రాజధాని నగరాన్ని శుభ్రంగా ఉంచుతామని వారు చేసిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. వారు దిల్లీ నీటి సరఫరా మీద కాకుండా మద్యం మీద దృష్టి సారించారన్నారు. ఈ లిక్కర్ పాలసీ నుంచి తాను లబ్ధి పొందినట్లు ఎలాంటి ఆధారాలు లేవని కేజ్రీవాల్ చెప్తున్నారని, ఈడీ మాత్రం అన్ని ఆధారాలను కోర్టుల ముందు ఉంచుతోందని వెల్లడించారు.

పీఎంఎల్‌ఏ కోర్టులో ఈడీ దాఖలు చేసిన అభియోగపత్రంలో కేజ్రీవాల్‌ను కీలక కుట్రదారుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ‘‘గోవాలోని గ్రాండ్‌ హయత్‌ హోటల్‌లో బస చేశారు. ఈ బిల్లును కేసులో నిందితుడైన చన్‌ప్రీత్‌ సింగ్‌ చెల్లించారు. సౌత్‌ గ్రూప్‌తోపాటు రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు ఈ కేసులో రూ.100 కోట్ల ముడుపులిచ్చారు. ఇందులో రూ.45 కోట్లను గోవాలో 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కోసం ఆప్‌ వినియోగించుకుంది. ప్రతి దశలో ఈ రూ.100 కోట్లపై కేజ్రీవాల్‌ నియంత్రణ కలిగి ఉన్నారు. నిధుల సేకరణ, కలిగి ఉండటం, బదిలీ చేయడం.. ఇలా ప్రతి విషయంలోనూ కేజ్రీవాల్‌ కుట్ర ఉంది. అందుకే మనీ లాండరింగ్‌ కేసులో ఆయన శిక్షకు అర్హుడు’’ అని ఈడీ కోర్టుకు తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని