Viral Video: ‘ప్లీజ్‌ మోదీజీ.. సాయం చేయండి’: బాలిక వీడియో రిక్వెస్ట్‌ వైరల్‌

Viral Video of Little Girl: ‘మోదీ (Modi)జీ.. మీకో విషయం చెప్పాలి. మా స్కూల్‌ చూడండి ఎలా ఉందో’ అంటూ ఓ చిన్నారి వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. తమకు మంచి స్కూల్‌ నిర్మించి ఇవ్వాలని ఆ బాలిక ప్రధానిని అభ్యర్థించింది.

Published : 14 Apr 2023 13:45 IST

కథువా(జమ్మూకశ్మీర్‌): తాను చదువుతున్న స్కూల్లో మౌలిక వసతులు సరిగా లేకపోవడంతో ఆవేదన చెందిన ఓ బాలిక.. తన బాధను ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi)కి తెలియజేయాలనుకుంది. ‘మా స్కూల్‌ ఎంత చెత్తగా ఉందో చూడండి’ అని చూపిస్తూ వీడియోలో మోదీ సాయం కోరింది. తమకో మంచి స్కూల్‌ కట్టించాలని ప్రధానిని వేడుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. (Viral Video of Little Girl)

జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లోని కథువా జిల్లా లొహై-మల్హార్‌ గ్రామానికి చెందిన సీరత్‌ నాజ్‌ (Seerat Naaz) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల (Govt School)లో చదువుతోంది. అయితే ఆ స్కూల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఆవేదన చెందిన సీరత్‌.. ఆ విషయాన్ని ప్రధాని మోదీ (PM Modi) దృష్టికి తీసుకెళ్లాలనుకుంది. ఇందుకోసం తన స్కూల్‌ను చూపిస్తూ ఓ సెల్ఫీ వీడియో తీసింది. దాదాపు 5 నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో ఆ బాలిక తన స్కూల్‌ పరిస్థితిని వివరించి.. సాయం చేయాలని ప్రధానిని అభ్యర్థించింది.

‘‘మోదీజీ (Modiji).. మీకో విషయం చెప్పాలి. మాకో మంచి స్కూల్‌ నిర్మించి ఇవ్వండి. ఇప్పుడున్న మా స్కూల్‌ ఎలా ఉందో చూడండి. బెంచీలు లేక నేలమీదే కూర్చుంటున్నాం. నేల మట్టికొట్టుకుపోయి చెత్తగా ఉంది. దీంతో మా యూనిఫామ్‌కు దుమ్ము అంటుకుని మాసిపోతోంది. అది చూసి మా అమ్మలు మమ్మల్ని తిడుతున్నారు. టాయిటెల్‌ చూడండి ఎంత ఘోరంగా పగిలిపోయి ఉందో..! గత ఐదేళ్లుగా ఈ బిల్డింగ్‌ ఇలాగే ఉంది. మీకు భవనం లోపల ఎలా ఉందో కూడా చూపిస్తాను చూడండి. మోదీజీ మీరు దేశం మొత్తం మాట వింటారు కదా..! నా మాట కూడా వినండి ప్లీజ్‌. మాకో మంచి స్కూల్‌ను కట్టించండి. అప్పుడు మేం బాగా చదువుకోగలం. ప్లీజ్‌ మాకు సాయం చేయండి’’ అని చిన్నారి సీరత్‌ తన వీడియోలో ప్రధానిని కోరింది.

జమ్మూకశ్మీర్‌కు చెందిన ‘మార్మిక్‌ న్యూస్‌’ అనే స్థానిక మీడియా సంస్థ ఈ చిన్నారి వీడియోను తన ఫేస్‌బుక్‌ పేజీలో షేర్‌ చేయడంతో ఇది కాస్తా ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను దాదాపు 20లక్షల మంది వీక్షించారు. చిన్నారి ముద్దుముద్దు మాటలు.. ఎలాంటి బెరుకు లేకుండా ప్రధానిని ఉద్దేశించి చేసిన అభ్యర్థనను చూసి నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ బాలిక అభ్యర్థనను స్వీకరించి స్కూల్‌కు మరమ్మతులు చేపట్టేలా ప్రధాని చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని