Afghanistan: సంప్రదింపులు, నిధుల విడుదలతోనే అఫ్గాన్‌ను ఆదుకోగలం

సంక్షోభంలోకి కూరుకుపోయిన అఫ్గానిస్థాన్‌ను తాలిబన్ల ప్రభుత్వం ఏ విధంగా గాడిన పెడుతుందోనని ప్రపంచ దేశాలు గమనిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐరాస కీలక వ్యాఖ్యలు చేసింది. తాలిబన్లతో సంప్రదింపులు, ఇటీవల స్తంభింపజేసిన దాతల నిధుల విడుదలతో...

Published : 10 Sep 2021 19:14 IST

ఐరాస ప్రత్యేక ప్రతినిధి డెబోరా లియోన్స్

కాబుల్‌: సంక్షోభంలోకి కూరుకుపోయిన అఫ్గానిస్థాన్‌ను తాలిబన్ల ప్రభుత్వం ఏ విధంగా గాడిన పెడుతుందోనని ప్రపంచ దేశాలు గమనిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐరాస కీలక వ్యాఖ్యలు చేసింది. తాలిబన్లతో సంప్రదింపులు, ఇటీవల స్తంభింపజేసిన నిధుల విడుదలతోనే ఆ దేశాన్ని ఆదుకోగలమని ఐరాస ప్రత్యేక ప్రతినిధి, అఫ్గాన్‌లో ఐరాస సహాయ మిషన్‌ హెడ్‌ డెబోరా లియోన్స్ అన్నారు. ఈ దిశగా ప్రపంచ దేశాలు చొరవ తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో అక్కడ తీవ్ర ఆర్థిక మాంద్యం ఏర్పడి, స్థానికులు పేదరికంలోకి కూరుకుపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. శరణార్థుల సంఖ్య కూడా పెరిగే ప్రమాదం ఉందన్నారు. అఫ్గాన్‌ పరిస్థితులను ఉటంకిస్తూ తాజాగా ఆమె యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్(యూఎన్‌ఎస్‌సీ)లో ప్రసంగించారు. లక్షలాది అఫ్గానీయుల జీవితాలు ప్రస్తుతం తాలిబన్ల పాలన తీరుపై ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. అఫ్గాన్ మాజీ అధికారులకు క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్లు ప్రకటనలు చేసినప్పటికీ, తాలిబన్లు ప్రస్తుతం ఇంటింటి సోదాలు చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గాన్‌లో మహిళల హత్యలు, హక్కుల అణచివేత, ఇతర ఉల్లంఘనలపై వస్తున్న నివేదికలను ఉటంకిస్తూ.. ఐరాస కూడా కొత్త ప్రభుత్వంతో ఎలా సంప్రదింపులు జరపాలో నిర్ణయించాల్సి ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని