‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’ వల్లే తీవ్రత తగ్గిందా..?

వ్యాప్తి తగ్గడానికి స్థానిక హెర్డ్‌ ఇమ్యూనిటీతో పాటు దేశంలో యువత జనాభా ఎక్కువగా ఉండటం దోహదం చేసినట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

Updated : 05 Jan 2021 06:22 IST

దిల్లీ: కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువ ఉన్న దేశాల్లో భారత్‌ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, దేశంలో గతకొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో దేశంలో వైరస్‌ తీవ్రత తగ్గడం నిజమేనని శాస్త్రవేత్తలు కూడా నిర్ధారిస్తున్నారు. అయితే వ్యాప్తి తగ్గడానికి స్థానిక హెర్డ్‌ ఇమ్యూనిటీతో పాటు దేశంలో యువత జనాభా ఎక్కువగా ఉండటం దోహదం చేసినట్లు పేర్కొంటున్నారు.

రోజువారీ కేసులు లక్షకు చేరువై..
ప్రపంచంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్‌ రెండో స్థానంలో ఉంది. కరోనా తీవ్రత ఎక్కువగా సమయంలో రోజువారీ కేసుల సంఖ్య లక్షకు చేరువైంది. ఏకంగా సెప్టెంబర్‌ 16న గరిష్ఠంగా 97,894 కేసులు రికార్డయ్యాయి. కానీ, ప్రస్తుతం రోజువారీ కేసుల సంఖ్య 20వేలకు పడిపోయింది. జనవరి 4న కేవలం 16,504 కేసులు మాత్రమే బయటపడ్డాయి. ఈ లెక్కన చూస్తే కరోనా తీవ్రత గ్రాఫ్‌ గణనీయంగా తగ్గినట్లేనని నిపుణులు భావిస్తున్నారు. కేసులు నమోదవుతున్న తీరును గమనిస్తే కచ్చితంగా ఇది తగ్గుదలే అని అశోక యూనిర్సిటీలోని త్రివేదీ స్కూల్‌ ఆఫ్‌ బయోసైన్సెస్‌ విభాగాధిపతి షాహిద్‌ జమీల్‌ పేర్కొన్నారు. మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరినీ పరీక్షించడం అసాధ్యమైన విషయమని అభిప్రాయపడ్డారు. అయితే, సెప్టెంబర్‌ మధ్య నుంచి కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం మొదలైందని పేర్కొన్నారు.

హెర్డ్‌ ఇమ్యూనిటీ ఉండొచ్చు..
దేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న నగరాల్లో దిల్లీ కూడా ఒకటి. నిత్యం దాదాపు 6 వేలకు పైగా కేసులు, మరణాలతో దిల్లీ వణికిపోయింది. అలాంటి దిల్లీలో ఇప్పుడు కేవలం 384 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇది గత ఏడు నెలల్లోనే కనిష్ఠం కావడం విశేషం. అయితే, ఇంతటి మెరుగైన పరిస్థితి రావడానికి హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ‘‘దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో తీవ్రత ఎక్కువగా ఉన్న పరిస్థితిని గమనించాం. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు, రద్దీ ప్రదేశాల్లో వైరస్‌ విస్తృతి విపరీతంగా ఉంది. అనంతరం అది గరిష్ఠ స్థాయికి చేరుకుని ఒకరకమైన ‘స్థానిక హెర్డ్‌ ఇమ్యూనిటీ’ వచ్చిఉంటుంది’’ అని జాతీయ ఇమ్యూనాలజీ కేంద్రం (ఎన్‌ఐఐ) నిపుణులు డాక్టర్‌ సత్యజీత్‌ రథ్‌ పేర్కొన్నారు.

యువ జనాభా..
భారత్‌లో వైరస్‌ తీవ్రత తగ్గడానికి యువ జనాభా కూడా ఒక కారణంగా నిపుణులు భావిస్తున్నారు. దేశ జనాభాలో 65శాతం మంది దాదాపు 35ఏళ్ల వయసువారే. వైరస్‌ వ్యాప్తి తగ్గడానికి ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చని ప్రముఖ ఆర్థికవేత్త, ఎపిడమాలజిస్ట్‌ రామనన్‌ లక్ష్మీనారాయణ్‌ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా తొలి దఫా విజృంభణతో ప్రజల్లో కాస్త హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చే అవకాశం ఉంటుందని, రెండో సారి వైరస్‌ అంత తేలికగా వ్యాప్తి చెందడానికి వీలు ఉండకపోవచ్చని తెలిపారు. అందుకే రెండో దఫా (సెకండ్‌ వేవ్‌) వైరస్‌ విజృంభణకు అవకాశాలు తక్కువేనని ఆయన వివరించారు. 

హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించడానికి కొలమానం లేనప్పటికీ దాదాపు 60శాతం మందిలో రోగనిరోధకత ద్వారా దీన్ని సాధించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే, దీన్ని నేరుగా వైరస్‌ వ్యాప్తి వల్ల కాకుండా టీకా ద్వారా సాధించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి..
కొవాగ్జిన్‌ వైపు ప్రపంచ దేశాల చూపు..!
పిల్లలపై వ్యాక్సిన్‌ ప్రయోగాలకు అనుమతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని