UNLOCK: ఊపిరి పీల్చుకుంటున్న రాష్ట్రాలు!

దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ధాటికి రాష్ట్రాలన్నీ వణికిపోయాయి. ఈ ప్రభావంతో ఏప్రిల్‌ నుంచి చాలా రాష్ట్రాలు కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ ఆంక్షల్లోకి వెళ్లిపోయాయి.

Updated : 07 Jun 2021 18:53 IST

పలు రాష్ట్రాల్లో మొదలైన కార్యకలాపాలు

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ధాటికి రాష్ట్రాలన్నీ వణికిపోయాయి. ఈ ప్రభావంతో ఏప్రిల్‌ నుంచి చాలా రాష్ట్రాలు కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ ఆంక్షల్లోకి వెళ్లిపోయాయి. తాజాగా దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రెండు నెలల అనంతరం కనిష్ఠంగా నమోదయ్యింది. దీంతోపాటు పలు రాష్ట్రాల్లో వైరస్‌ నియంత్రణలోకి రావడంతో ఆంక్షలను సడలిస్తున్నట్లు ఆయా రాష్ట్రాలు ప్రకటించాయి. ఇందులో భాగంగా దిల్లీ, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర రాష్ట్రాలు ఆంక్షలను సడలించడంతో దుకాణాలు, కార్యాలయాలు తెరచుకున్నాయి.

దేశ రాజధానిలో ట్రాఫిక్‌ జామ్‌..

కరోనా ఉద్ధృతి తగ్గిన నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో నేటినుంచి ఆంక్షల సడలింపునిచ్చారు. దీంతో షాపింగ్‌ మాల్స్‌, మార్కెట్‌లు తెరచుకున్నాయి. ప్రైవేటు కార్యాలయాలు కూడా 50శాతం సామర్థ్యంతో నిర్వహించుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. దీంతో ప్రజలు తమ వాహనాలతో బయటకు రావడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దుకాణాలకు మాత్రం ఉదయం పది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరచుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఇక మూడు వారాలు పూర్తి స్తంభించిపోయిన మెట్రో రైలు సేవలు నేటి నుంచి అందుబాటులోకి వచ్చాయి.

మహారాష్ట్రలో ఐదు స్థాయిల్లో..

కరోనా ధాటికి వణికిపోయిన మహారాష్ట్రలో చాలా ప్రాంతాల్లో కరోనా తగ్గుముఖం పట్టింది. దీంతో వైరస్‌ తీవ్రతను బట్టి రాష్ట్రంలో జిల్లాలను ఐదు విభాగాలుగా వర్గీకరించిన అధికారులు, ఆంక్షలను సడలిస్తున్నారు. దీంతో ముంబయిలో రెస్టారెంట్లు, దుకాణాలు తెరచుకున్నాయి. అన్‌లాక్‌ వ్యూహంలో భాగంగా మెట్రో నగరాలను లెవల్‌-3లో ఉంచినందున థియేటర్లు, మల్టీప్లెక్సులపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఆర్‌టీసీ బస్సులు కూడా పూర్తి స్థాయిలో సేవలు అందిస్తున్నాయి.

ఉత్తర్‌ప్రదేశ్‌ కంటైన్‌మెంట్‌ జోన్లు మినహా..

కరోనా వైరస్‌ తీవ్రత ఉద్ధతి తగ్గినందున ఉత్తర్‌ప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించారు. మొత్తం 71 జిల్లాల్లో ఆంక్షలను ఎత్తివేయగా.. వారణాసి, ముజఫర్‌నగర్‌, గౌతమ్‌బుద్ధ్‌ నగర్‌, ఘజియాబాద్‌లలో కంటైన్‌మెంట్‌ జోన్లు లేని ప్రాంతాలల్లో ఆంక్షలను తొలగించారు. ఈ నాలుగు జిల్లాల్లో కరోనా క్రియాశీల కేసుల సంఖ్య 600కు తక్కువగా ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లఖ్‌నవూ, గోరఖ్‌పూర్‌, మీరట్‌, షహారన్‌పూర్‌లలో పూర్తి స్థాయిలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే, ఈ మినహాయింపు కేవలం వారంలో ఐదు రోజులు మాత్రమే ఉంటాయని.. వారాంతంలో ఆంక్షలు కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

తమిళనాడులో సాయంత్రం ఐదు వరకు..

తమిళనాడులో కరోనా తీవ్రత కాస్త తగ్గినట్లు కనిపిస్తున్నట్లున్పటికీ పలు ప్రాంతాల్లో ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. దీంతో కోయంబత్తూర్‌ వంటి 11 హాట్‌జిల్లాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో సడలింపు ఇచ్చారు. ఉదయం 6 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వివిధ కార్యకలాపాలు సాగించుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఆటోల్లో ఇద్దరు, క్యాబ్‌లలో ముగ్గురు చొప్పున ఈ-పాస్‌ సహాయంతో ప్రయాణించేందుకు అధికారులు అనుమతి ఇస్తున్నారు.

లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలిస్తున్నట్లు గుజరాత్‌ ప్రభుత్వం ప్రకటించింది. దుకాణాలను తెరచుకునేందుకు ఉదయం 9గం. నుంచి సాయంత్రం 6గంటల వరకు అనుమతి ఇచ్చింది. వైరస్‌ తీవ్రత కొనసాగుతున్నందున హరియాణాలో జూన్‌ 14వరకు లాక్‌డౌన్‌ను పొడిగించారు. అయినప్పటికీ ఆంక్షలను సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదయం పది నుంచి రాత్రి 8వరకు షాపింగ్‌ మాల్స్‌ తెరచుకునేందుకు అనుమతి ఇచ్చారు. రెస్టారెంట్లు, బార్లు, క్లబ్‌లు కూడా 50శాతం సామర్థ్యంతో నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సిక్కీం లోనూ జూన్‌ 14వరకు లాక్‌డౌన్‌ పొడిగించినప్పటికీ పలు ఆంక్షల నుంచి సడలింపునిచ్చారు. ఇక కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతున్న దృష్ట్యా ఆంక్షలను మరికొన్ని రోజుల పాటు కొనసాగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని