Updated : 05 Jan 2021 10:36 IST

ఇంగ్లండ్‌లో మళ్లీ లాక్‌డౌన్‌

కొత్తరకం కరోనా కట్టడి కోసం తప్పని ఆంక్షలు

లండన్‌: ఇంగ్లండ్‌ వ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్‌ విధించారు. కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రకటించారు. బుధవారం నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. మరోవైపు స్కాట్లాండ్‌లో మంగళవారం అర్ధరాత్రి నుంచే కఠిన ఆంక్షల్ని అమలు చేయనున్నారు.

ఇప్పటికే ఇంగ్లండ్‌లో దాదాపు 44 మిలియన్లు అంటే దేశ మొత్తం జనాభాలో మూడొంతుల మంది కఠిన ఆంక్షల వలయంలో ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక కొవిడ్‌ మరణాలు నమోదవుతున్న దేశాల్లో బ్రిటన్‌ ఒకటి. కరోనా కొత్త రకం వ్యాప్తి మరింత వేగవంతమైనట్లు అక్కడి వైద్య వర్గాలు భావిస్తున్నాయి. సోమవారం నాటికి 27వేల మంది కొవిడ్‌తో ఆస్పత్రుల్లో చేరినట్లు బోరిస్‌ జాన్సన్‌ వెల్లడించారు. ఏప్రిల్‌లో నమోదైన తొలి విడత విజృంభణ కంటే ఇది 40 శాతం అధికం కావడం గమనార్హం. గత మంగళవారం ఒక్కరోజే ఏకంగా 80వేల పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. అప్పటికే ప్రజల కదలికలపై కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయినా, భారీ స్థాయిలో కేసుల రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించాల్సి వస్తోందని అధికారులు వివరించారు.

లాక్‌డౌన్‌లో భాగంగా స్కూళ్లు, షాపింగ్‌ మాళ్లు, రెస్టారెంట్లు, జిమ్‌లు పూర్తిగా మూసివేయనున్నారు. ఉదయం పూట వ్యాయామం, వైద్య సాయం కోసం తప్ప ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని ఆదేశించారు. విద్యార్థుల వార్షిక పరీక్షల నిర్వహణపై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని బోరిస్‌ జాన్సన్‌ తెలిపారు. ఫిబ్రవరి రెండో వారం వరకు ఈ ఆంక్షలు కొనసాగే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. మరోవైపు వ్యాక్సిన్‌ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. మరో ఆరు వారాల్లో వైద్యారోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు సహా కొవిడ్‌ ముప్పు అధికంగా ఉన్నవారందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వడం పూర్తవుతుందన్నారు.

ఇవీ చదవండి..

బ్రిటన్‌లో ఆక్స్‌ఫర్డ్‌ టీకా షురూ

4 రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ కలకలం​​​​​​


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts