Lockdown: బిహార్‌లో నేటి నుంచి..

బిహార్‌ కూడా పూర్తి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించింది. మే 15వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొంది.

Updated : 04 May 2021 12:50 IST

ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ వెల్లడి

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణతో పలు రాష్ట్రాలు విలవిలలాడుతున్నాయి. దీంతో ఇప్పటికే చాలా రాష్ట్రాలు కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా బిహార్‌ కూడా పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించింది. మే 15వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొంది.

‘రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో కేబినెట్‌ మంత్రులు, అధికారులతో చర్చించిన అనంతరం మే 15వరకు లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించాం. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు సంక్షోభ నియంత్రణ విభాగం ప్రకటిస్తుంది’ అని బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ట్విటర్‌లో వెల్లడించారు. ఇక బిహార్‌ ఆరోగ్యశాఖ నివేదిక ప్రకారం, నిన్న ఒక్కరోజే అక్కడ దాదాపు 12వేల పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5లక్షల మార్కును దాటింది. గడిచిన 24గంటల్లో మరో 82 కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 2821కి చేరినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇదిలాఉంటే, మహారాష్ట్ర, దిల్లీ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలతో పాటు గోవాలో పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌, జమ్మూ, హరియాణా, గుజరాత్‌లలోనూ పాక్షిక లాక్‌డౌన్‌, వారాంతపు లాక్‌డౌన్‌ వంటి ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ సమయంలో దేశవ్యాపంగా లాక్‌డౌన్‌ విధించడంపై చర్చ జరుగుతుండగా.. వీటికి మద్దతు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్‌ నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడం ఒక్కటే మార్గమని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కూడా అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని