Omicron: మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ పెడతారా? ఆరోగ్య మంత్రి ఏమన్నారంటే..

దేశంలోనే అత్యధిక ఒమిక్రాన్‌ కేసులు మహారాష్ట్రలో వస్తుండగా.. మరోవైపు, కొవిడ్‌ కేసులు కూడా మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా ఇంకో రెండు ఒమిక్రాన్‌......

Updated : 25 Dec 2021 23:35 IST

ముంబయి: మహారాష్ట్రలో ఓవైపు అత్యధిక ఒమిక్రాన్‌ కేసులు వస్తుండగా.. మరోవైపు, కొవిడ్‌ కేసులు కూడా మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా ఇంకో రెండు ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో కొత్త వేరియంట్‌ కేసుల సంఖ్య 110కి చేరింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ తోపే కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులతో మెడికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్ రోజుకు 800 మెట్రిక్‌ టన్నులకు చేరినప్పుడే రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తామని వ్యాఖ్యానించారు. ఈ మేరకు జల్నాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒమిక్రాన్‌ కేసులు పెద్ద సంఖ్యలో వస్తున్నప్పటికీ రోగులు ఐసీయూల్లో చేరడం గానీ, మెడికల్‌ ఆక్సిజన్‌ అవసరం గానీ అంతగా లేదని చెప్పారు. రోజుకు 800 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ డిమాండ్‌ని చేరితేనే లాక్‌డౌన్‌ విధించనున్నట్టు తెలిపారు. అయితే, రాష్ట్రంలో ప్రస్తుతం మెడికల్‌ ఆక్సిజన్‌ వినియోగం ఎంత ఉందనేది మాత్రం ఆయన వెల్లడించలేదు. ప్రజలు మరిన్ని ఆంక్షలు ఎదుర్కోవాలని తాము కోరుకోవడంలేదన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనల్ని కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. మాస్క్‌ ధరించడం అత్యంత అవసరమన్నారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు 110 ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాగా.. వారిలో 57మంది డిశ్చార్చి అయ్యారు.

మరోవైపు, ఒమిక్రాన్ కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం నిన్ననే పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ప్రతిరోజూ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూని విధించింది. ఆ సమయంలో ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దని ఆంక్షలు పెట్టింది. 50శాతం సామర్థ్యంతో థియేటర్లు, హోటళ్లు, జిమ్‌లకు అనుమతించింది. వేడుకల్లో 100 మందికి మాత్రమే అనుమతిస్తామని, బహిరంగ వేడుకల్లో అయితే 250 మంది వరకు అనుమతిస్తామని స్పష్టంచేసింది. ఈ అర్ధరాత్రి నుంచే ఆంక్షలు అమలులోకి వస్తాయని స్పష్టంచేసింది.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని