Lions on tracks: రైల్వే ట్రాక్‌పై 10 సింహాలు.. లోకోపైలట్‌ ఏం చేశారంటే!

రైల్వే ట్రాక్‌పైకి ఒకేసారి పది సింహాలు వచ్చిన ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది.

Published : 18 Jun 2024 00:06 IST

భావ్‌నగర్‌: రైలు వేగంగా వెళ్తోన్న సమయంలో ట్రాక్‌పైకి ఒకేసారి పది సింహాలు వచ్చిన ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన లోకోపైలట్‌.. తక్షణమే ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. దాంతో వాటికి ప్రాణాపాయం తప్పింది. రైలు డ్రైవర్‌ సమయస్ఫూర్తికి అధికారుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. గుజరాత్‌లోని పిపావావ్‌ పోర్టు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

‘‘గుజరాత్‌లోని పిపావావ్‌ పోర్టు స్టేషన్‌ నుంచి గూడ్స్‌ రైలు వెళ్తోంది. ఆ క్రమంలో ట్రాక్‌పై 10 సింహాలు సేదతీరుతున్నట్లు లోకో పైలట్‌ ముకేశ్‌ కుమార్‌ మీనా గుర్తించారు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. అవి పట్టాల నుంచి లేచి దూరంగా వెళ్లే వరకు అతడు వేచిచూశాడు. అనంతరం రైలు బయలుదేరింది. మీనా చేసిన పనికి అధికారుల నుంచి ప్రశంసలు లభించాయి’ అని వెస్టర్న్‌ రైల్వే భావ్‌నగర్‌ డివిజన్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. సింహాలతోపాటు వన్యప్రాణుల సంరక్షణకు తమ డివిజన్‌ నిరంతరం కృషి చేస్తోందని తెలిపింది.

ఉత్తర గుజరాత్‌- పిపావావ్‌ పోర్టు మార్గంలో రైల్వే లైనులో కొన్నేళ్లుగా అనేక సింహాలు మరణిస్తున్నాయి. గిర్‌ అభయారణ్యానికి ఈ ప్రాంతం చాలా దూరంలోనే ఉన్నప్పటికీ ఇక్కడ సింహాలు తరచూ సంచరిస్తుంటాయి. దీంతో ట్రాక్‌ మార్గంలో అటవీశాఖ కంచెలను కూడా ఏర్పాటు చేసింది. ఇదిలాఉంటే, గుజరాత్‌లో దాదాపు 674 ఆసియా సింహాలు ఉన్నట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని