Lok Sabha: సామాన్యుడి ఇంగితం...! ప్రజాస్వామ్య సంతకం

నూటనలభై కోట్ల మంది భారతీయుల ప్రతిరూపంగా... వారి ఆశలు, ఆకాంక్షలను మోసుకుంటూ పద్దెనిమిదో లోక్‌సభ నేడు కొలువుదీరబోతోంది. 1952 నుంచి... నేటి దాకా ప్రతి  లోక్‌సభ ఎన్నికా వైవిధ్యమే! మనది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమని, పరిణతి చెందిన ప్రజాస్వామ్యమని నిరూపిస్తూ వస్తున్నారు భారతీయులు!

Updated : 24 Jun 2024 06:59 IST

నూటనలభై కోట్ల మంది భారతీయుల ప్రతిరూపంగా... వారి ఆశలు, ఆకాంక్షలను మోసుకుంటూ పద్దెనిమిదో లోక్‌సభ నేడు కొలువుదీరబోతోంది. 1952 నుంచి... నేటి దాకా ప్రతి  లోక్‌సభ ఎన్నికా వైవిధ్యమే! మనది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమని, పరిణతి చెందిన ప్రజాస్వామ్యమని నిరూపిస్తూ వస్తున్నారు భారతీయులు! నెహ్రూను మూడుసార్లు ఆదరించినా... ఆమోదించిన ఇందిరనే అట్టడుగుకు నెట్టేసినా... ఆకాశానికెత్తిన రాజీవ్‌ను ఐదేళ్లలోనే విపక్షంలో కూర్చోబెట్టినా... సంకీర్ణాలను భరించినా... మోదీని పదేళ్లు మెచ్చి... మూడోసారి సంకీర్ణంలో బిగించినా... ప్రతి లోక్‌సభా... సగటు భారతీయ ఓటరు పరిణతికి ప్రతీక! 18వ లోక్‌సభలో కొత్త ఎంపీలు ప్రమాణస్వీకారం చేస్తున్న నేపథ్యంలో... ఇప్పటిదాకా జరిగిన లోక్‌సభ ఎన్నికల విశేషాలపై అవలోకనం..
 

లోక్‌సభ ఎన్నికల చరిత్ర...

ఇంగితానికి మారుపేరు ఇండియన్‌ ఓటరు! ఇప్పుడే కాదు... తొలి సార్వత్రిక ఎన్నికల నుంచీ ఇదే శైలి! 1951లో జరిగిన మొదటి ఎన్నికల నాటి నుంచీ భారత ఎన్నికల తీర్పులు విలక్షణం... విభిన్నం! నిరక్షరాస్యత, పేదరికం, సౌకర్యాలు... ఇలా ఎన్నింటిలో వెనకబడ్డా... ఇంగితజ్ఞానంలో మాత్రం... భారతీయులు అందరికంటే ముందున్నారనేదే ప్రతి ఎన్నిక చెబుతున్న సత్యం! 18వ లోక్‌సభ కొలువు తీరుతున్న వేళ... ఇప్పటిదాకా జరిగిన లోక్‌సభ ఎన్నికలను, వాటి తీర్పులను ఒక్కసారి అవలోకిస్తే...


1951-52
అందరికీ ఓటు... అంబేడ్కర్‌ ఓటమి

స్వాతంత్య్రం వచ్చిన మూడున్నరేళ్ల స్వల్పకాలంలోనే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమైంది భారతావని! ఈ ఎన్నిక పార్టీల గెలుపు ఓటములకంటే... భారత ప్రజాస్వామ్యానికి పరీక్షగా నిల్చింది. 82% ప్రజలు నిరక్షరాస్యులు... ఎవ్వరికీ ఇంత భారీస్థాయిలో ఎన్నికలు నిర్వహించిన అనుభవం లేదు. అయినా 21 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించారు. అప్పటికే ఆధునికం అనుకున్న అమెరికాలో సైతం అందరికీ ఓటు హక్కు లేదు! అయినా భారత్‌ ధైర్యం చేసింది! 

 • దేశవ్యాప్తంగా... 401 నియోజకవర్గాల్లో 489 లోక్‌సభ సీట్లకు ఎన్నికలు జరిగాయి. వీటితో పాటు రాష్ట్రాల్లో 3288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తొలి ఎన్నికల కమిషనర్‌ సుకుమార్‌ సేన్‌ సారథ్యంలో 1951 అక్టోబరులో మొదలై... 1952 ఫిబ్రవరి దాకా 68 అంచెల్లో నాలుగు నెలల పాటు సాగిందీ ప్రక్రియ! 
 • 17.32 కోట్ల మంది ఓటర్ల (ఇందులో 45% మహిళలు) కోసం 19 లక్షల బ్యాలెట్‌బాక్స్‌లను సిద్ధం చేశారు. ఒక్కోదాని ఖరీదు... రూ 4-రూ.6.12 పైసలు! ప్రతి అభ్యర్థికి ఒక బ్యాలెట్‌ బాక్స్‌ ఉంచారు. దానిపై ఆ అభ్యర్థి గుర్తు ఉంటుంది. ఇలా ఎంతమంది అభ్యర్థులుంటే అన్ని బ్యాలెట్‌బాక్స్‌లను వరుసగా పెట్టారు. ఓటర్లు తమకిష్టమైన అభ్యర్థి బాక్స్‌లో బ్యాలెట్‌ పేపరు వేశారు. 51శాతం ఓటింగ్‌ జరిగింది.
 • బ్యాలెట్‌ పేపరు... ఒకరూపాయి నోటు సైజులో తయారైంది.
 • ఈ ఎన్నికల్లో కొన్ని సీట్లలో బహుళ ప్రాతినిధ్య పద్ధతి కొనసాగింది. అంటే కొన్ని సీట్ల నుంచి ఇద్దరు (జనరల్, రిజర్వ్‌డ్‌) ఎంపికయ్యారు. బెంగాల్‌లో ఒకచోట ముగ్గురు (జనరల్, ఎస్సీ, ఎస్టీ) ఎంపికయ్యారు. 1962 నుంచి ఈ పద్ధతి తొలగించి ప్రస్తుత ఒకసీటు- ఒక ప్రతినిధి పద్ధతిని అనుసరిస్తున్నారు.
 • చలికాలంలో మంచు కురుస్తుందని... హిమాచల్‌ప్రదేశ్‌లో అందరికంటే ముందు అక్టోబరులోనే ఎన్నిక నిర్వహించారు. దేశవ్యాప్తంగా... 1951 డిసెంబరు 10న ఎన్నికలు మొదలయ్యాయి. తొలి ఎన్నికల్లో... గుడివాడ (అప్పుడు మద్రాసు రాష్ట్రంలో ఉండేది) 77.9 పోలింగ్‌ శాతంతో దేశంలో మూడోస్థానంలో నిలిచింది. 
 • 1952 ఏప్రిల్‌ 2న ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్‌ 318 సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత అత్యధిక సీట్లు సీపీఐ (16)కే! 37 మంది స్వతంత్రులు గెలిచారు.

అంబేడ్కర్‌ ఓటమి సంచలనం!

రాజ్యాంగ నిర్మాత... బి.ఆర్‌.అంబేడ్కర్, తర్వాతికాలంలో ప్రధాని పీఠం అధిష్ఠించిన మొరార్జీ దేశాయ్‌లాంటి వారు ఈ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. అంబేడ్కర్‌... బొంబే నార్త్‌ సెంట్రల్‌ సీటులో తన మాజీ పర్సనల్‌ సెక్రటరీ నారాయణ్‌ చేతిలో 15వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. జవహర్‌లాల్‌ నెహ్రూ సారథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.


1957
రాష్ట్రాలు తగ్గి... సీట్లు పెరిగి

తొలి ఎన్నికల్లో 27 రాష్ట్రాలుండగా (స్వాతంత్య్రానంతరం కొన్ని సంస్థానాలను కూడా రాష్ట్రాలుగా పరిగణించారు) ... 1957లో రెండో సార్వత్రిక ఎన్నికల నాటికి వాటిలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రాల సంఖ్య తగ్గింది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్విభజన జరగటంతో దేశంలో 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. 1951 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన కూడా జరిగింది. దీంతో 403 నియోజకవర్గాల్లో 494 సీట్లకు (బహుళ ప్రాతినిధ్య పద్ధతి కారణం... 91 సీట్లలో ఇద్దరిని ఎంచుకునేవారు) ఓటింగ్‌ జరిగింది.

 • ఈ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 19.36 కోట్లకు పెరిగింది. తొలి ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్‌శాతం (47.54%) తగ్గింది.
 • ఈ ఎన్నికల్లో పోలింగ్‌ పద్ధతి మార్చారు. రూపాయి సైజులోని బ్యాలెట్‌ పేపర్‌నిచ్చి... తమకు నచ్చిన అభ్యర్థి డబ్బాలో వేసే పద్ధతికి బదులు... నచ్చిన అభ్యర్థికి బ్యాలెట్‌ పేపర్‌పై ముద్ర వేసే పద్ధతి ప్రవేశపెట్టారు. ఈవీఎంలు తెచ్చేదాకా ఇదే కొనసాగింది. 
 • కాంగ్రెస్‌ గతంలో కంటే అధిక సీట్లను 371 గెల్చుకుంది. నెహ్రూ రెండోసారి ప్రధానిగా ప్రమాణం చేశారు. సీపీఐ 27 సీట్లతో రెండోస్థానంలో నిల్చింది. 45 మంది మహిళలు నిలబడగా... 22 మంది నెగ్గారు.
 • ఈ ఎన్నికల్లో... సోషలిస్టు నాయకుడు రామ్‌ మనోహర్‌ లోహియా చందౌలి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాతి కాలంలో రాష్ట్రపతి అయిన... వీవీ గిరి కూడా... పార్వతీపురం నియోజకవర్గంలో పరాజయం పాలయ్యారు. భారతీయ జన్‌సంఘ్‌ తరఫున మూడుచోట్ల  పోటీ చేసిన అటల్‌ బిహారీ వాజ్‌పేయీ... ఒకచోటే నెగ్గారు.
 • అసెంబ్లీ ఎన్నికల్లో... కేరళలో కమ్యూనిస్టు (సీపీఐ) పార్టీ అధికారంలోకి వచ్చింది. స్వతంత్ర భారత చరిత్రలో అధికారం చేపట్టిన తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం అదే.

1962
బహుళ ప్రాతినిధ్యానికి చెల్లు

మూడో సార్వత్రిక ఎన్నికల నాటికి భారత ఎన్నికల కమిషన్‌ పూర్తిగా సర్వసన్నద్ధమైంది. అందుకే 1962 ఎన్నికల్లో అంతకుముందుకన్నా ఎక్కువ పోలింగ్‌ (55.43%) నమోదైంది. తొలి రెండు ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు కలిపి జమిలి ఎన్నికలే జరిగాయి. 

 • ఫిబ్రవరి 16 నుంచి 25 మధ్య పదిరోజుల పాటు ఎన్నికలు నిర్వహించగా... కౌంటింగ్‌ పూర్తయ్యేందుకు 3వారాలు పట్టింది.
 • తొలి రెండు ఎన్నికల్లో పాటించిన బహుళ ప్రాతినిధ్య పద్ధతికి స్వస్తి చెప్పటం ఈ ఎన్నికల ప్రత్యేకత. ఒకే నియోజకవర్గం నుంచి ఒకరికంటే ఎక్కువమందిని ఎన్నుకునే బదులు... ఎస్సీ, ఎస్టీలకు సీట్లను ప్రత్యేకంగా రిజర్వ్‌ చేశారు. ఫలితంగా... మూడో సార్వత్రిక ఎన్నికల్లో 387 సీట్లు జనరల్‌కు, 76 ఎస్సీలకు, 31 ఎస్టీలకు కేటాయించారు.
 • చరణ్‌సింగ్, రాజగోపాలచారిలాంటి వారి నుంచి అంతర్గతంగా పోటీ ఎదురైనా... జవహర్‌లాల్‌ నెహ్రూ సారథ్యంలోని కాంగ్రెస్‌కు ఇబ్బందేమీ కాలేదు. విపక్షం కూడా అంతంతమాత్రమే! దీంతో మూడోసారి 73 ఏళ్ల నెహ్రూ సారథ్యంలో కాంగ్రెస్‌ 361 సీట్లు గెల్చి అధికారంలోకి వచ్చింది. 29 సీట్లతో సీపీఐది తర్వాతి స్థానం. భారతీయ జన్‌సంఘ్‌ (ప్రస్తుత భాజపా మాతృక)కు 14 సీట్లు దక్కాయి. 35 మంది మహిళలు నెగ్గారు. 
 • నెహ్రూపై పోటీ చేసిన రామ్‌మనోహర్‌ లోహియా పరాజయం పాలయ్యారు. అప్పటి బలమైన విపక్ష నేత జేబీ కృపలానీతో పాటు... అటల్‌ బిహారీ వాజ్‌పేయీ కూడా ఓడిపోయారు.
 • 1962 ఏప్రిల్‌లో నెహ్రూ అధికారం చేపట్టారు. 

అక్టోబరులో చైనా దురాక్రమణ మొదలెట్టింది. నెలరోజుల తర్వాత చైనా తనంతటతానే కాల్పుల విరమణ ప్రకటించినా... నెహ్రూ, కాంగ్రెస్‌లకు బలమైన దెబ్బతాకింది. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో 10 చోట్లకుగాను నాలుగింటిని మాత్రమే కాంగ్రెస్‌ గెల్చుకోగలిగింది. రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ బలహీనతకు బీజాలు పడ్డాయి.


1967
చివరి జమిలి... సంకీర్ణశకం

1962 నుంచి 1967 ఎన్నికల మధ్య దేశం రాజకీయంగా సంఘర్షిత వాతావరణాన్ని ఎదుర్కొంది. ఇద్దరు ప్రధానుల హఠాన్మరణం... రెండు యుద్ధాలు... పార్టీల్లో విభేదాలు... చీలికలకు తోడు కాంగ్రెస్‌ బలహీన పడి దేశ రాజకీయ చిత్రం మారటం మొదలైంది. ఇందిరాగాంధీ శకం ఆరంభమైంది.

 • మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేసిన రెండేళ్లకే చైనాతో యుద్ధానంతరం జవహర్‌లాల్‌ నెహ్రూ 1964లో మరణించారు. ఆయన తర్వాత ప్రధాని పదవి చేపట్టిన లాల్‌ బహదూర్‌శాస్త్రి హయాంలో పాకిస్థాన్‌తో యుద్ధం సంభవించింది. తాష్కెంట్‌లో పాకిస్థాన్‌తో ఒప్పందం చేసుకున్న మరునాడే అనుమానాస్పద పరిస్థితుల్లో ఆయన మరణించారు. కాంగ్రెస్‌ అంతర్గత కుమ్ములాటల్లో నెగ్గి... నెహ్రూ కుమార్తె... శాస్త్రి కేబినెట్‌లో సమాచార మంత్రిత్వశాఖను నిర్వహించిన ఇందిరాగాంధీ... 1966 జనవరి 24న ప్రధానిగా పదవి చేపట్టారు.
 • కామరాజ్‌ప్లాన్‌లో భాగంగా సీనియర్‌ నేతల రాజీనామాలు కోరటంతో కాంగ్రెస్‌లో అంతర్గత పోరు, అసంతృప్తులు పెరిగాయి. కేరళ కాంగ్రెస్‌లో చీలిక వచ్చింది. 1964లో కమ్యూనిస్టు పార్టీ కూడా సీపీఐ, సీపీఎంలుగా చీలింది. రిపబ్లికన్‌పార్టీలో, శిరోమణి అకాలీదళ్‌లో చీలికలు వచ్చాయి. 
 • 1967లో ఫిబ్రవరి 17 నుంచి 21 మధ్య నాలుగో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. స్వతంత్ర భారతంలో లోక్‌సభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన చివరి జమిలి ఎన్నికలివే! కారణం... అనేక రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు అధికారంలోకి రావటమే!
 • 1961 జనాభా లెక్కల ఆధారంగా... 520 లోక్‌సభ సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 77 ఎస్సీలకు, 37 ఎస్టీలకు రిజర్వ్‌ చేశారు. నాగాలాండ్, హరియాణా కొత్తగా ఆవిర్భవించాయి. హిమాచల్‌ప్రదేశ్, మణిపుర్, త్రిపుర, గోవా, దమన్‌ఖీదీవ్, పుదుచ్చేరిలాంటి కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్తగా అసెంబ్లీలు వచ్చాయి. దీంతో రాష్ట్రాల్లో మొత్తం 3563 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలయ్యాయి.
 • 25.03 కోట్ల మంది ఓటర్లలో 15.27 కోట్ల మంది (61%పైగా) ఓటు హక్కు వినియోగించుకున్నారు.
 • సీట్లు తగ్గినా... ఇందిరాగాంధీ సారథ్యంలో కాంగ్రెస్‌ 283 సీట్లతో అధికారంలోకి వచ్చింది. రాజగోపాలచారి నాయకత్వంలోని స్వతంత్రపార్టీ... 44 సీట్లతో లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా నిల్చింది. ఆ పార్టీకి గుజరాత్, ఒడిశా, రాజస్థాన్‌లలో సీట్లు వచ్చాయి.
 • 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ గెల్చినా... ఐదింట- బిహార్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లలో ఆ పార్టీకి మెజార్టీ రాలేదు. తమిళనాడులో అన్నాదురై సారథ్యంలోని డీఎంకే కాంగ్రెస్‌ను ఓడించింది. ఆయా రాష్ట్రాలతో పాటు హరియాణా, మధ్యప్రదేశ్‌ల్లో కూడా సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. యూపీలోనైతే... సైద్ధాంతికంగా బద్ధవ్యతిరేకులైన జన్‌సంఘ్‌ నుంచి కమ్యూనిస్టుల దాకా... అంతా కలసి దాదాపు 20 పార్టీలతో ప్రభుత్వం ఏర్పడింది.
 • సంకీర్ణాలతో పాటు... దేశ రాజకీయాల్లో ఇందిరాగాంధీ శకం ఆరంభమైంది.

1971
ఎదురులేని విజయం నుంచి ఎమర్జెన్సీ!

ప్రస్తుతం రాజకీయాల్లో చూస్తున్న అనేక అవలక్షణాలు, ఎన్నికల్లో చూస్తున్న అక్రమాలు ఊపందుకుంది ఈ 1971 ఎన్నిక నుంచే! రాజకీయ ఎత్తులు పైఎత్తులు... పై చేయి సాధించేందుకు ఎంతకైనా దిగే దిగజారుడు జిత్తులు... ఎన్నికల్లో బూత్‌ ఆక్రమణలు... బ్యాలెట్‌ బాక్సులు ఎత్తుకెళ్లటం, దాడులు, ఎన్నికల హింస ఈ ఎన్నికల్లో, ఆ తర్వాతా స్పష్టంగా కనిపించాయి.

 • 1971 ఎన్నికలకు ముందు... అప్పటికే ప్రధానిగా కొనసాగుతున్నా ఇందిరాగాంధీకి, పార్టీలోని సీనియర్‌ నేతలకు పొసగలేదు. ఫలితంగా కాంగ్రెస్‌లో చీలిక వచ్చింది.
 • అదే సమయంలో... ఆయా రాష్ట్రాల్లోని సంకీర్ణ ప్రభుత్వాలు రాజకీయంగా పొసగక ఇబ్బందుల్లో పడ్డాయి. 1968-69ల్లోనే వాటికి మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఫలితంగా... జమిలికి బ్రేక్‌ పడింది.
 • ఇందిర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ సీనియర్లు అవిశ్వాస తీర్మానం పెట్టడంతో... బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దులాంటి నిర్ణయాలతో... సీపీఐ, మరికొందరి మద్దతు కూడగట్టుకొని ఇందిర గట్టెక్కింది. ఈ ఊపులోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకుంది. గరీబీ హటావో అని నినాదమిచ్చి ఇందిర బరిలోకి దూకారు.
 • 1971 మార్చిలో పదిరోజులపాటు ఎన్నికలు జరిగాయి. 27.31 కోట్ల మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు.
 • లోక్‌సభతో పాటు కేవలం మూడు ఒడిశా, పశ్చిమబెంగాల్, తమిళనాడు... అసెంబ్లీలకు ఎన్నికలయ్యాయి.
 • గరీబీ హటావో నినాదం పనిచేసింది. ఇందిరాగాంధీ సారథ్యంలోని కాంగ్రెస్‌కు 352 సీట్లతో తిరుగులేని మెజార్టీ లభించింది. సీపీఎంకి 25, సీపీఐ, డీఎంకేలకు 23 సీట్ల చొప్పున వచ్చాయి. భారతీయ జన్‌సంఘ్‌ 22 సీట్లు గెల్చుకుంది.
 • రాయ్‌బరేలీ నుంచి ఇందిరాగాంధీ... రాజ్‌నారాయణ్‌పై లక్ష ఓట్లకుపైగా ఆధిక్యంతో నెగ్గారు.
 • మార్చిలో మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేసిన ఇందిర వెలుగువెలిగింది. 1971 డిసెంబరులో... పాకిస్థాన్‌తో యుద్ధంలో నెగ్గి... బంగ్లాదేశ్‌ ఆవిర్భావంతో ఆమె ప్రాభవం పెరిగిపోయింది. ఇంతలో... 1975 జూన్‌ 12న అలహాబాద్‌ హైకోర్టు... ఆమె ఎన్నిక చెల్లదని తీర్పివ్వటంతో ఒక్కసారిగా పరిస్థితి తల్లకిందులైంది. దీన్ని తట్టుకోలేని ఇందిర... 1975 జూన్‌ 25న దేశంలో అత్యయిక పరిస్థితిని (ఎమర్జెన్సీ) ప్రకటించారు. దేశ రాజకీయాలను మలుపుతిప్పారు.

1977
తొలి కాంగ్రెసేతర సర్కారు

ఎన్నికల గడవు ముగిసిన ఏడాదికి 1977 జనవరిలో ఎమర్జెన్సీ ఎత్తివేసి, లోక్‌సభని రద్దుచేశారు. దాంతో ఏడో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ మొదలైంది.

 • మొరార్జీ దేశాయ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌(ఓ), చరణ్‌సింగ్‌ సారథ్యంలోని భారతీయ లోక్‌దళ్, వాజ్‌పేయీ, అడ్వాణీల భారతీయ జన్‌సంఘ్, సోషలిస్ట్‌ పార్టీ.. ఈ నాలుగు జాతీయ పార్టీలు కలిసి జనతా పార్టీగా ఏర్పడ్డాయి.
 • 1971 జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ సభ్యుల సంఖ్యని 543కు పెంచారు. జనతా పార్టీ 298 సీట్లతో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా నిలిచింది. మార్చి 24న మొరార్జీ దేశాయ్‌ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. స్వాతంత్య్రానంతరం కేంద్రంలో ఏర్పడ్డ తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఇదే.
 • కాంగ్రెస్‌కు 154 సీట్లు వచ్చాయి. ఇందిరాగాంధీ రాయ్‌బరేలీలో రాజ్‌నారాయణ్‌ చేతిలో ఓడిపోయారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కర్ణాటక నుంచి ఆమె గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు.
 • మొరార్జీ దేశాయ్‌.. అధికారంలోకి వచ్చిన నెల రోజులకే తొమ్మిది రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాల్ని రద్దు చేశారు. కానీ అంతర్గత కుమ్ములాటలతో జనతా ప్రభుత్వం పూర్తికాలం పాలనలో లేదు. మొరార్జీ తర్వాత చరణ్‌సింగ్‌ కాంగ్రెస్‌ మద్దతుతో ప్రధాని అయ్యారు. కానీ నెలరోజులకే కాంగ్రెస్‌ మద్దతు ఉపసంహరించుకుంది. దాంతో రెండున్నరేళ్ల వ్యవధిలోనే ఏడో లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి.

1980
భాజపా ఆవిర్భావం

ఆగస్టు 22న 1979లో కేంద్రంలో ప్రభుత్వం రద్దవ్వగా.. 1980 జనవరిలో పోలింగ్‌ జరిగింది. ఎమర్జెన్సీ వాసనలు పోయి... ఈ ఎన్నికల్లో ఇందిర నేతృత్వంలోని కాంగ్రెస్‌(ఐ) 353 సీట్లు గెలిచింది. రాయ్‌బరేలీ, మెదక్‌ నియోజకవర్గాల నుంచి ఇందిరాగాంధీ గెలిచారు.

 • జనతా పార్టీ నుంచి బయటకు వచ్చి వాజ్‌పేయీ, అడ్వాణీ భారతీయ జనతా పార్టీని ప్రారంభించారు.
 • పంజాబ్‌లో వేర్పాటువాద ఉద్యమం ఇందిర ప్రభుత్వానికి సవాలుగా మారింది. అమృత్‌సర్‌ స్వర్ణదేవాలయంలో తలదాచుకున్న తీవ్రవాది భింద్రన్‌ వాలేను పట్టుకునేందుకు జూన్‌ 1, 1984లో ‘ఆపరేషన్‌ బ్లూస్టార్‌’ను మొదలుపెట్టారు. భింద్రన్‌వాలేను సైన్యం మట్టుబెట్టింది. కానీ పవిత్ర సిక్కు స్వర్ణదేవాలయం రక్తసిక్తమైంది. అక్టోబరు 31, 1984లో ఇందిరను ఆమె సిక్కు అంగరక్షకులు ఇంట్లోనే కాల్చి చంపారు. ఆమె కుమారుడు 40 ఏళ్ల రాజీవ్‌గాంధీ ప్రధాని అయ్యారు.

1984
తొలిసారి చార్‌సౌ పార్‌...

ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ పదేపదే కలవరించిన చార్‌సౌ పార్‌... (400 దాటాలి) అనేది ఎన్నికల భారతంలో ఇప్పటిదాకా ఒకేఒకసారి సాధ్యమైంది. అదీ కాంగ్రెస్‌ పార్టీకి! ఇందిరాగాంధీ హత్యానంతరం ప్రత్యేక పరిస్థితుల్లో... జరిగిన 1984 ఎన్నికల్లో సానుభూతి పవనాల వీచికలో కాంగ్రెస్‌ ఓట్ల, సీట్ల వరద పారింది. స్వాతంత్య్రానంతరం జరిగిన తొలి ఎన్నికల ఊపులో కూడా రానన్ని సీట్లు కాంగ్రెస్‌ ఈసారి సాధించింది. 414 సీట్ల భారీ మెజార్టీతో రాజీవ్‌గాంధీ సారథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది.

 • కాంగ్రెస్‌ సానుభూతి సునామీలో విపక్షాలన్నీ కొట్టుకుపోయాయి.
 • ఆంధ్రప్రదేశ్‌లో నందమూరి తారకరామారావు సారథ్యంలో కొత్తగా ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఈ సునామీని తట్టుకొని నిలబడింది. 30 లోక్‌సభ సీట్లు గెలిచి లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది.
 • భారతీయ జనతాపార్టీ దేశవ్యాప్తంగా రెండంటే రెండుసీట్లు సాధించింది.
 • 40 ఏళ్ల వయసులోనే ప్రధానిగా అధికారం చేపట్టిన రాజీవ్‌గాంధీ... పార్టీపై, ప్రభుత్వంపై పట్టుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో... కొన్ని తప్పులు, కొన్ని ఒప్పులతో అయోమయంలో పడ్డారు.
 • ఓటు హక్కు వయసుని 21 నుంచి 18కి తగ్గించారు.
 • స్వీడిష్‌ ఆయుధాల కంపెనీ బోఫోర్స్‌తో ఒప్పందాల్లో రాజీవ్‌ ప్రభుత్వం బద్నాం అయ్యింది. ఈ ఒప్పందంలో రూ.64 కోట్ల ముడుపులు రాజీవ్‌ కుటుంబానికి ముట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో అది పెద్దమొత్తమే. ఈ కుంభకోణమే... ఆయన మెడకు చుట్టుకుంది.

1989
మండల్‌... మందిర్‌

 • రాజీవ్‌గాంధీపై భోఫోర్స్‌ అవినీతి ఆరోపణల కారణంగా... 1989 ఎన్నికల నాటికి... కాంగ్రెస్‌ 197 సీట్లకు పడిపోయింది.
 • జనతాదళ్‌ 143 సీట్లు గెలిచింది. భాజపా 85 సీట్లు, వామపక్షాలు 45 సీట్లు గెల్చుకున్నాయి. 197 సీట్లతో కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయినా ప్రభుత్వ ఏర్పాటుకు పిలుపు రాలేదు. భాజపా, వామపక్షాల మద్దతుతో 1989 డిసెంబరులో వీపీసింగ్‌ ప్రధానిగా జనతాదళ్‌ నేతృత్వంలో ‘నేషనల్‌ ఫ్రంట్‌’ సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది.
 • 1984లో కనీవినీ ఎరగని మెజారిటీతో ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్‌... ఆ తర్వాత అంతే దారుణంగా పడిపోయింది. ఎంతగా అంటే...మళ్లీ ఇప్పటిదాకా ఎన్నడూ సొంతగా అధికారంలోకి రాలేనంతగా!
 • మందిర్‌-మండల్‌ రాజకీయాలు నడిచిన సమయమిది. దేశరాజకీయాల్లో ఎన్నో మలుపులు.
 • దేశవ్యాప్తంగా ఓబీసీల్ని ప్రసన్నం చేసుకోవడానికి మండల్‌ కమిషన్‌ ఆధారంగా వారికి 27 శాతం రిజర్వేషన్లు తెచ్చారు వీపీసింగ్‌. ఆ తర్వాత భాజపా అగ్రనేత అడ్వాణీ చేపట్టిన రథయాత్ర రాజకీయంగా దుమారం రేపింది. ఆ యాత్రను బిహార్‌లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అడ్డుకోవడంతో భాజపా కేంద్రానికి మద్దతు ఉపసంహరించుకుంది. వీపీసింగ్‌ ప్రభుత్వం పడిపోయింది.
 • జనతాదళ్‌లో ఒక వర్గంతో బయటకు వచ్చిన చంద్రశేఖర్‌కు కాంగ్రెస్‌ బయట నుంచి మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్‌ తనకు మద్దతు ఏ క్షణమైనా ఉపసంహరించుకుంటుందని గ్రహించిన చంద్రశేఖర్‌ ప్రధానిగా ఆరు నెలలు సాగాక 1991 మార్చిలో తన పదవికి రాజీనామా చేసి... ప్రభుత్వ రద్దుకు సిఫార్చు చేశారు.

1991
రాజీవ్‌ హత్య... పీవీకి పీఠం

టీఎన్‌ శేషన్‌ ముఖ్య ఎన్నికల అధికారిగా ఉండగా ఈ ఎన్నికలు జరిగాయి. 1991 మే 20, జూన్‌ 12, 15 తేదీల్లో పోలింగ్‌ జరిగింది. మొదటి విడత ఎన్నికలు జరిగిన మర్నాడే రాజీవ్‌ హత్యకు గురయ్యారు. ఎల్టీటీఈ ఆయనను పొట్టనపెట్టుకుంది.

 • కాంగ్రెస్‌ 232 చోట్ల గెలిచింది. అనూహ్య పరిణామాల మధ్య పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారు. ఆయనకు కొన్ని చిన్న పార్టీలూ, జనతాదళ్‌లోని ఒక వర్గం మద్దతు పలికాయి. 
 • మన్మోహన్‌ సింగ్‌ ఆర్థిక మంత్రిగా... పీవీ దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది ఈ సమయంలోనే. కాంగ్రెస్‌లోని మిగతా సీనియర్ల అసమ్మతిని తట్టుకుని.. పీవీ పూర్తికాలం అధికారంలో ఉండటం విశేషం. బాబ్రీ మసీదు కూల్చివేత, ముంబయిలో బాంబు దాడులు.. లాంటి సంఘటనలు దేశాన్ని కుదిపేశాయి.

1998
జయ దెబ్బకు వాజ్‌పేయీ ఔట్‌

రెండేళ్లలోపే 11వ లోక్‌సభ రద్దు కావడంతో 1998 ఫిబ్రవరిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు.

 • భాజపాకు 182, కాంగ్రెస్‌కు 141 సీట్లు మాత్రమే వచ్చాయి. వాజ్‌పేయీ నేతృత్వంలో నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయెన్స్‌(ఎన్డీయే) సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. దీనికి తెలుగుదేశం పార్టీ బయటి నుంచి మద్దతు తెలిపింది.
 • 1999, ఏప్రిల్‌లో ఎన్డీయే పక్షమైన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత డిమాండ్లను వాజ్‌పేయీ అంగీకరించకపోవడంతో ఆమె తన పార్టీ మద్దతును ఉపసంహరించుకున్నారు. దాంతో మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.
 • ఈ ఎన్నికల్లోనే మొదటిసారిగా 16 లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా ఈవీఎంలను వినియోగించడం విశేషం.

1996
రెండేళ్లు... ముగ్గురు ప్రధానులు...

పదకొండో లోక్‌సభకు జరిగిన ఎన్నికలు చరిత్రాత్మకమైనవి. కాంగ్రెస్‌ అత్యంత తక్కువ స్థానాలను (140) దక్కించుకుంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో 161 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపాను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌ శర్మ ఆహ్వానించారు. 

 • వాజ్‌పేయీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ, ఆ సంబరం వారికి ఎంతోకాలం నిలవలేదు. లోక్‌సభలో సభ్యుల విశ్వాసం పొందాల్సి రావడంతో.. బలపరీక్షను నిర్వహించారు. రెండు రోజుల చర్చ అనంతరం జరిగిన ఓటింగ్‌లో ఆయన సభ్యుల విశ్వాసాన్ని పొందలేకపోయారు. దాంతో కేవలం 13 రోజుల్లోనే సర్కారు కూలిపోయింది.
 • ఆ తర్వాత భాజపాకు వ్యతిరేకంగా 13 పార్టీలతో కలిసి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో యునైటెడ్‌ ఫ్రంట్‌ ఏర్పడింది. కానీ, ఆ కూటమికి మెజారిటీ లేకపోవడంతో బయటి నుంచి కాంగ్రెస్‌ మద్దతుతో కర్ణాటక సీఎంగా ఉన్న దేవెగౌడ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. పది నెలల తర్వాత కాంగ్రెస్‌ మద్దతును ఉపసంహరించుకోవడంతో యునైటెడ్‌ ఫ్రంట్‌ సర్కారు కూలిపోయింది.
 • అప్పుడు కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న సీతారాం కేసరి, యునైటెడ్‌ ఫ్రంట్‌లోని మరో వ్యక్తిని ఎంపిక చేస్తే మద్దతు ఇస్తామని తేల్చిచెప్పడంతో.. ఐకే.గుజ్రాల్‌ పీఎంగా బాధ్యతలు చేపట్టారు. 
 • దేవెగౌడ కేబినెట్‌తోనే ఆయన ప్రభుత్వాన్ని కొనసాగించారు. ఏడు నెలలు గడిచాక.. రాజీవ్‌ హత్య కేసులో డీఎంకే పాత్రపై పలు ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. దాంతో సర్కారు నుంచి డీఎంకే సభ్యులను తొలగించాలని కాంగ్రెస్‌ పట్టుబట్టింది. అందుకు గుజ్రాల్‌ నిరాకరించడంతో.. 1997, నవంబరులో ఆయన ప్రధాని పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. లోక్‌సభనూ రద్దు చేశారు.

1999
ఎట్టకేలకు వాజ్‌పేయీ పూర్తిగా

మే నుంచి జులై వరకు సాగిన కార్గిల్‌ యుద్ధంలో పాక్‌ సేనలను భారత దళాలు ఓడించాయి. ఆ తర్వాత కొద్దిరోజులకు సెప్టెంబరు-అక్టోబరులో 13వ లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఎన్డీయే కూటమి సర్కారు ఏర్పాటుకు కావాల్సిన సంపూర్ణ మెజారిటీని సాధించింది. దాంతో ముచ్చటగా మూడోసారి ప్రధానిగా వాజ్‌పేయీ బాధ్యతలు చేపట్టారు. ఈసారి అయిదేళ్ల పూర్తి కాలం విధులు నిర్వర్తించి.. ఆ ఘనత సాధించిన తొలి కాంగ్రెసేతర నేతగానూ గుర్తింపు పొందారు.


2004-14
యూపీయే హయాం

 • భారత ఆర్థిక వ్యవస్థ స్వల్ప వృద్ధి సాధించింది. రహదారుల మెరుగుకు ప్రధానమంత్రి గ్రామ సడక్‌యోజన, దిల్లీ, కోల్‌కతా, ముంబయి, చెన్నైలను కలుపుతూ స్వర్ణ చతుర్భుజి చేపట్టింది. వీటన్నింటితో ఎన్డీయే మళ్లీ విజయం సాధించడం ఖాయమన్న ధీమాతో అప్పటి ప్రధానమంత్రి వాజ్‌పేయీ 13వ లోక్‌సభను 2004 ఫిబ్రవరి 6న ముందస్తుగానే రద్దుచేశారు. 
 • నిర్ణీత కాలవ్యవధి ప్రకారం 2004 సెప్టెంబరు-అక్టోబరులో జరగాల్సిన లోక్‌సభ ఎన్నికలు.. ముందస్తుగా ఏప్రిల్‌-మే నెలల్లో జరిగాయి. 
 • పూర్తిస్థాయిలో ఈవీఎంలతో జరిగిన ఎన్నికలుగా 2004 ఎన్నికలు చరిత్రలో నిలిచిపోయాయి. అప్పటి నుంచి లోక్‌సభ, శాసనసభ ఎన్నికలను ఈవీఎంలతోనే నిర్వహిస్తున్నారు. 
 • భారత్‌ వెలిగిపోతోంది (ఇండియా షైనింగ్‌)’’ అంటూ భాజపా ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఎన్డీయే విజయం ఖాయమని ఆ కూటమిలోని పార్టీలే కాదు.. రాజకీయ విశ్లేషకులు కూడా గట్టిగా విశ్వసించారు.
 • అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సారథ్యంలోని యూపీయే విజయఢంకా మోగించింది. 2004లో అప్పటి తెరాసతోపాటు సీపీఎం, జేఎంఎం, ఆర్జేడీ, జేడీ(ఎస్‌), డీఎంకే తదితర పార్టీల మద్దతుతో యూపీయే అధికారం చేపట్టింది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీయే కూటమి 335 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగా.. అప్పటి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సూచనలతో మన్మోహన్‌సింగ్‌ ప్రధానిగా ఎన్నికయ్యారు. 1999లో 182 ఎంపీ సీట్లను గెలుచుకున్న భాజపా 2004లో 138 సీట్లకు పరిమితమైంది. 1999లో ఎన్డీయేకు 303 ఎంపీ స్థానాలు ఉండగా 2004 ఎన్నికల్లో 181కు తగ్గాయి. 
 • మన్మోహన్‌ ప్రధానిగా.. యూపీయే 2009 ఎన్నికల్లోనూ గెల్చింది. 2004లో 145 ఎంపీ సీట్లను గెలుచుకున్న కాంగ్రెస్‌ 2009లో 206 స్థానాలను కైవసం చేసుకుంది.  2009 ఎన్నికలకు ఏడాది ముందు వాజ్‌పేయీ.. అనారోగ్యం కారణంగా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. వాజ్‌పేయీ ప్రభుత్వ హయాంలో ఉప ప్రధానిగా, హోం మినిస్టరుగా కొనసాగిన ఎల్‌.కె.అడ్వాణీని భాజపా ప్రధానమంత్రి అభ్యర్థిగా తెరపైకి తీసుకొచ్చింది. భాజపా ప్రభ మసకబారింది. 116 ఎంపీ స్థానాలతో సరిపెట్టుకుంది.

2014-19
మోదీ హవా మొదలు...

కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీయే పదేళ్ల పాలనతో, బలహీనమైన సంకీర్ణాల ప్రభుత్వాలతో విసిగివేసారిన ప్రజలు.. స్థిరమైన ప్రభుత్వం, సమర్థ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్న వేళ.. భారతీయ జనతా పార్టీకి చెందిన నరేంద్ర మోదీ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. 

 • గుజరాత్‌ ముఖ్యమంత్రిగా అప్పటికే జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిన మోదీ ఆ ఎన్నికలతో మొదటిసారి జాతీయ రాజీకీయాల్లో అడుగుపెట్టారు. ఒక్కసారిగా భాజపా ముఖచిత్రంగా మారారు. 
 • 2014లో 16వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో భాజపా 282 సీట్లు గెల్చుకుని సొంతంగా ప్రభుత్వ స్థాపనకు కావాల్సిన మేజిక్‌ ఫిగర్‌(272)ని దాటింది. 1984 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తర్వాత.. 30ఏళ్లకు భాజపా మాత్రమే ఈ ఘనత సాధించింది. భాజపా నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో కొలువుదీరింది. ఎన్డీయేకు 336 సీట్లు వచ్చాయి. అదే సమయంలో కాంగ్రెస్‌ ఘోరంగా 44 సీట్లకు పరిమితమైంది. 
 • మోదీ నాయకత్వం, అభివృద్ధితోపాటు.. జాతీయవాదం, హిందూత్వ అంశమూ కలిసి రావడంతో భాజపా 2019లోనూ విజయ దుందుభి మోగించింది. భాజపా అధ్యక్షుడిగా.. అమిత్‌ షా వ్యూహ రచనా పనిచేసింది. ఈసారి ఈ పార్టీ సొంతంగా 303 సీట్లు సాధించింది. ఎన్డీయేకు దాదాపు 350 సీట్లు వచ్చాయి. దక్షిణాదిన కొన్ని సీట్లు తగ్గినా.. దేశమంతా మోదీపైన నమ్మకం ఉంచింది. కాంగ్రెస్‌కు 52, యూపీయేకు 92 సీట్లు వచ్చాయి. ఈసారి ఆర్టికల్‌ 370 రద్దు లాంటి కొన్ని సాహసోపేత నిర్ణయాల్ని కేంద్రం తీసుకుంది. 

2024
మళ్లీ సంకీర్ణం

ప్రజాస్వామ్యంలో ఓటరును మించిన మేధావి ఉండరని 18వ లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి రుజువైంది. స్థిరమైన ప్రభుత్వం దిశగా ఆలోచించి.. గత రెండు ఎన్నికల్లో ఒకే పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన భారతీయ ఓటర్లు.. ఈసారి తమ ఆలోచనను మార్చుకున్నారు. మోదీకి, హిందూత్వకు ఎదురులేదన్న భ్రమల్ని తొలిగించి.. ప్రజాస్వామంలో గెలుపోటములకు ఎవరూ అతీతులు కాదని నిరూపించారు. దశాబ్దం తర్వాత మళ్లీ ఏ పార్టీకీ సంపూర్ణమైన ఆధిక్యంలేని తీర్పు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ‘చార్‌సౌ పార్‌’ అంటూ నరేంద్ర మోదీ, భాజపా ఇచ్చిన పిలుపునకు ఓటర్ల నుంచి మద్దతు లభించలేదు. భాజపాకు అత్యధిక సీట్లు ఇస్తూనే... మేజిక్‌ ఫిగర్‌కు దగ్గర్లో ఆపేశారు. ఫలితమే భాజపాకు ఓటమిలాంటి గెలుపు, కాంగ్రెస్‌కు గెలుపులాంటి ఓటమి. 2019లో భాజపాకు 303 సీట్లు, ఎన్డీయేకు 350 సీట్లు వచ్చాయి. ఈసారి భాజపా బలం 240కూ, ఎన్డీయే బలం 293కూ తగ్గింది. కాంగ్రెస్‌ గత ఎన్నికలకంటే 

47 సీట్లు అదనంగా గెలుచుకుని బలాన్ని 99కు పెంచుకుంది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని 20 పార్టీల ‘ఇండియా’ కూటమి 234 సీట్లు సాధించింది. ఈసారి ఎన్నికల్లో సమాజ్‌వాదీ(37), తృణమూల్‌ కాంగ్రెస్‌(29), డీఎంకే(22), తెలుగుదేశంపార్టీ(16), జేడీయూ(12) చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు గెలిచాయి. ఏ పార్టీకీ పూర్తిస్థాయి మెజారిటీ లేకపోవడంతో మరోసారి జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యం ఏర్పడింది. లోక్‌సభ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఎన్డీయేలో చేరిన తెదేపా, జేడీయూ.. నూతన ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారాయి. పదేళ్ల తర్వాత మళ్లీ నరేంద్రమోదీ సారథ్యంలోనే అయినా... సంకీర్ణ సర్కారు కేంద్రంలో కొలువుదీరింది. నెహ్రూ తర్వాత మూడోసారి ఎన్నికల్లో నెగ్గిన ఘనత మోదీ ఖాతాలో చేరింది.


లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా పొందిన ప్రాంతీయ పార్టీ?

1. స్వతంత్ర భారత్‌లో మొట్టమొదటి లోక్‌సభ కొలువుదీరింది ఎప్పుడు?

2. తొలి లోక్‌సభ స్పీకర్‌?

3. ప్రస్తుతం లోక్‌సభలో ఎస్టీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాలు ఎన్ని?

4. తొలి ఎన్నికల కమిషనర్‌?

5. సుదీర్ఘ కాలం ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిందెవరు?

6. తొలి లోక్‌సభలో మహిళా ఎంపీల సంఖ్య?

7. లోక్‌సభకు రాష్ట్రపతి ఎంతమందిని నామినేట్‌ చేస్తారు?

8. లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయడానికి అర్హత వయసు?

9. దేశానికి రెండుసార్లు తాత్కాలిక ప్రధానిగా పనిచేసింది ఎవరు?

10. ఈవీఎంలను పూర్తిస్థాయిలో ఉపయోగించిన సార్వత్రిక ఎన్నికలు? 

11. మొట్టమొదటి కాంగ్రేసేతర ప్రధానమంత్రి?

12. దేశంలో అతి చిన్న, అతి పెద్ద లోక్‌సభ నియోజకవర్గాలు(ఓటర్ల సంఖ్యను అనుసరించి)?

13. ప్రజాప్రాతినిధ్య చట్టం అమల్లోకి వచ్చింది?

14. ఇప్పటిదాకా ఎంతమంది మహిళలు లోక్‌సభ స్పీకర్లుగా వ్యవహరించారు.

15. భారత్‌లో మహిళలకు ఎప్పటి నుంచి ఓటుహక్కు కల్పించారు?

16. రాష్ట్రాల్లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది?

17. తొలి ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెల్చుకున్న విపక్ష పార్టీ?

18. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా పొందిన ప్రాంతీయ పార్టీ?


జవాబులు

1. మే 13, 1952

2. గణేష్‌ వాసుదేవ్‌ మావలాంకర్‌

3. 47

4. సుకుమార్‌ సేన్‌

5. కల్యాణ్‌ సుందరం 1958 డిసెంబరు 20 నుంచి 1967 సెప్టెంబరు 

30 వరకు. ఎనిమిది సంవత్సరాల 284 రోజులు 

6. 24

7. ఇద్దరిని

8. 25 ఏళ్లు

9. గుల్జారీలాల్‌ నందా.. నెహ్రూ మరణంతో(మే 27 1964 నుంచి జూన్‌ 9 1964 వరకు), శాస్త్రి మరణం తర్వాత(జనవరి 11 1964- జనవరి 24 1966) 

10. 2004 లోక్‌సభ ఎన్నికలు

11. మొరార్జీ దేశాయ్‌(జనతా పార్టీ) 1977

12. అతి చిన్న నియోజకవర్గం కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌(57,594), అతి పెద్ద నియోజకవర్గం తెలంగాణలోని మల్కాజగిరి(37.4లక్షలు) 

13. 1950 ఏప్రిల్‌

14. ఇద్దరు- మీరా కుమార్‌ (కాంగ్రెస్‌) సుమిత్ర మహాజన్‌ (భాజపా)

15. తొలి సార్వత్రిక ఎన్నికల నుంచే 21 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ (తర్వాత 1989 ఎన్నికల నుంచి దీన్ని 18 ఏళ్లకు మార్చారు) ఓటు హక్కు ఇచ్చారు.

16. 1957లో కేరళలో! ఈఎంఎస్‌ నంబూద్రిపాద్‌ సారథ్యంలో ఏర్పడ్డ కమ్యూనిస్టు ప్రభుత్వమే స్వతంత్ర భారత్‌లో తొలి కాంగ్రెసేతర సర్కారు.

17. సీపీఐ(16)

18. తెలుగుదేశం పార్టీ(30 సీట్లు) 1984లో


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని