
Parliament: లోక్‌సభను కుదిపేసిన ‘లఖింపుర్’ ఘటన..
దిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై లోక్‌సభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఆ ఘటన ముందస్తు ప్రణాళికతో చేసిన కుట్రే అని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఘటనపై ప్రతిపక్షాలు నేడు చర్చకు పట్టుబట్టాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దీనిపై లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
అయితే రాహుల్ అభ్యర్థనను స్పీకర్ అంగీకరించలేదు. దీంతో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులతో వెల్‌లోకి దూసుకెళ్లారు. వారి ఆందోళన నడుమే స్పీకర్ ప్రశ్నోత్తరాల గంట చేపట్టారు. విపక్ష సభ్యులు తమ సీట్లలో కూర్చోవాలని స్పీకర్ వారించారు. ఇది సరైన పద్ధతి కాదని, సభ మర్యాదను సభ్యులు కాపాడాలని కోరారు. అయినప్పటికీ వారు వెనక్కి తగ్గకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
రాజ్యసభలోనూ గందరగోళం..
అటు రాజ్యసభలోనూ నేడు గందరగోళ వాతావరణం కన్పించింది. 12 మంది ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్‌ను రద్దు చేయాలని పట్టుబడుతూ విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. సీట్లలో నుంచి లేచి నినాదాలు చేశారు. సభను సజావుగా కొనసాగించాలని ఛైర్మన్ వెంకయ్యనాయుడు వారించినా వారు వినిపించుకోలేదు. దీంతో ప్రారంభమైన 5 నిమిషాలకే సభను మద్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు.