Parliament: ఉభయ సభల్లో అదే రగడ.. వాయిదా పడిన లోక్‌సభ

పెగాసస్ హ్యాకింగ్, ఇతర అంశాలపై పార్లమెంట్ దద్దరిల్లుతూనే ఉంది. వాటిపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభలు వాయిదాపడ్డాయి. జులై 19న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అప్పటినుంచి తొమ్మిదవరోజు రెండు సభల్లో వాయిదాలపర్వం కొనసాగుతోంది.

Updated : 30 Jul 2021 15:34 IST

దిల్లీ: పెగాసస్ హ్యాకింగ్, ఇతర అంశాలపై పార్లమెంట్ దద్దరిల్లుతూనే ఉంది. వాటిపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభలు వాయిదాపడ్డాయి. జులై 19న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అప్పటినుంచి తొమ్మిదోరోజు రెండు సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది.

ఉదయం 11.30 గంటల వరకూ సభ్యుల నిరసనల మధ్య కొనసాగిన లోక్‌సభ మధ్యాహ్నం వరకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన కార్యకలాపాలు సోమవారానికి వాయిదాప్డడాయి. సభలో విపక్ష నేతలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, మాకు న్యాయం కావాలంటూ నినాదాలు చేశారు. దాంతో స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేయాల్సి వచ్చింది. కాగా, లోక్‌సభలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ..‘315 మందికి పైగా సభ్యులు ప్రశ్నోత్తరాల సమయం జరగాలని కోరుకుంటున్నారు. కానీ ఇలాంటి ప్రవర్తన దురదృష్టకరం. పెగాసస్‌పై ఐటీ మంత్రి ఉభయ సభల్లో వివరణ ఇచ్చారు. ఇది అసలు తీవ్రమైన సమస్యే కాదు. పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా నడిచేలా చూద్దాం’ అని విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో కూడా ఇదే వైఖరి కొనసాగడంతో ఛైర్మన్ వెంకయ్య నాయుడు సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా.. సభ్యులు తమ నిరసన వ్యక్తం చేస్తోన్న తీరు పార్లమెంటరీ గౌరవాన్ని దిగజార్చుతుందని వెంకయ్యనాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని