Parliament: ‘అదానీ - హిండెన్‌బర్గ్‌’పై పార్లమెంట్‌లో రగడ.. ఉభయ సభలు రేపటికి వాయిదా

అదానీ సంస్థ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఇచ్చిన నివేదికపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో పార్లమెంట్‌లో గందరగోళ వాతావరణం ఏర్పడింది.

Updated : 02 Feb 2023 18:40 IST

దిల్లీ: పార్లమెంట్ (Parliament) బడ్జెట్ సమావేశాలు గందరగోళంగా మారాయి. అదానీ గ్రూప్‌ (Adani Group)పై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదిక వ్యవహారంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టాయి. దీంతో ఎలాంటి చర్చ లేకుండానే ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి.

బడ్జెట్ (Budget 2023) సమావేశాల్లో భాగంగా పార్లమెంట్ ఉభయ సభలు గురువారం సమావేశమయ్యాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ (Lok Sabha) ప్రారంభమైన తర్వాత స్పీకర్‌ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల గంటను మొదలుపెట్టారు. అయితే అదానీపై హిండెన్‌బర్గ్ నివేదిక గురించి చర్చించాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. కాంగ్రెస్‌ సహా కొన్ని పార్టీలు ఈ విషయంపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. అయితే, ఇందుకు సభాపతి అంగీకరించలేదు. ప్రశ్నోత్తరాల గంట చాలా ముఖ్యమైందని, సభ్యులు అంతరాయం కలిగించొద్దని కోరారు. అయినప్పటికీ ప్రతిపక్ష ఎంపీలు వెనక్కి తగ్గకపోవడంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. అటు రాజ్యసభ (Rajya Sabha)లోనూ ఇదే పరిస్థితి కన్పించింది. ఉదయం 11 గంటలకు ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ సభను ప్రారంభించగానే విపక్ష సభ్యులు ఆందోళన లేవనెత్తారు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్‌ ప్రకటించారు. మధ్యాహ్నం 2 గంటలకు ఉభయ సభలు తిరిగి ప్రారంభమవ్వగా.. పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. వాయిదా తీర్మానాలపై చర్చ జరపాల్సిందేనని ప్రతిపక్ష ఎంపీలు గట్టిగా నినాదాలు చేశారు. ఆందోళనల నేపథ్యంలో సభలను శుక్రవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.

దర్యాప్తు జరపాల్సిందే.. విపక్షాల డిమాండ్‌

అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికపై దర్యాప్తు చేపట్టాల్సిందేనని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఉభయ సభలు వాయిదా పడిన అనంతరం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేతో కలిసి విపక్ష నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) లేదా సీజేఐ ఆధ్వర్యంలోని కమిటీతో దర్యాప్తు జరిపించాలి. ఎల్‌ఐసీ, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కోట్లాది మంది ప్రజల పెట్టుబడులున్నాయి. వారి సొమ్ము ఇప్పుడు ప్రమాదంలో పడింది’’ అని విపక్షాలు ఆరోపించాయి.

అదానీ ఆయనలాగే మాట్లాడుతున్నారు: కాంగ్రెస్‌

హిండెన్‌బర్గ్‌ (Hindenburg Research) నివేదికతో వివాదం కొనసాగుతున్న వేళ.. అదానీ ఎంటర్‌ప్రైజెస్ రూ.20వేల కోట్ల మలివిడత పబ్లిక్‌ ఆఫర్‌ను వెనక్కి తీసుకుంది. దీనిపై తాజాగా అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ స్పందిస్తూ.. ఇన్వెస్టర్లను ఉద్దేశించి భావోద్వేగ ప్రసంగం చేశారు. అయితే ఈ ప్రసంగంపై కాంగ్రెస్‌ (Congress) తీవ్రంగా విమర్శించింది. ‘‘నైతికత గురించి అదానీ మాట్లాడటం.. ఆయన గురువు (ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ) వినయం, నిగ్రహం, విశాల హృదయం వంటి సద్గుణాలను బోధించడం లాంటిదే. ఇదంతా పొలిటికల్‌ సైన్స్‌’’ అంటూ కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

అదానీ సంస్థ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లో మోసాలు చేస్తోందంటూ గతవారం అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఇచ్చిన నివేదిక మార్కెట్‌ వర్గాల్లో తీవ్ర దుమారానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్‌ తీవ్రంగా ఖండించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని