Mohammad Faizal: లక్షద్వీప్‌ ఎంపీ ఫైజల్‌పై అనర్హత ఎత్తివేత

ఎన్‌సీపీ నేత మహమ్మద్‌ ఫైజల్‌ (Mohammad Faizal)పై అనర్హతను లోక్‌సభ రద్దు చేసింది. రాహుల్‌ గాంధీ వ్యవహారంపై దుమారం రేగుతున్న వేళ.. లోక్‌సభ సచివాలయం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Updated : 29 Mar 2023 11:24 IST

దిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అనర్హత వ్యవహారం చర్చనీయాంశంగా మారిన వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్‌సీపీ నేత మహమ్మద్‌ ఫైజల్‌ (Mohammad Faizal)పై గతంలో వేసిన అనర్హత (disqualification) వేటును లోక్‌సభ సచివాలయం ఎత్తివేసింది. ఆయనపై అనర్హతను ఉపసంహరించుకుంటున్నట్లు, ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు లోక్‌సభ సెకట్రేరియట్ (Lok Sabha Secretariat) బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. తన అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరుగుతుండగానే.. ఈ నోటిఫికేషన్‌ రావడం గమనార్హం. (Mohammad Faizal Disqualification)

అసలేం జరిగిందంటే..

2009లో కాంగ్రెస్‌ నాయకుడు మహ్మద్‌ సలీహ్‌పై దాడి చేశారన్న కేసులో ఈ ఏడాది జనవరి 10న లక్షద్వీప్‌ ఎంపీ మహ్మద్‌ ఫైజల్‌ (Mohammad Faizal)ను కవరత్తీ సెషన్స్‌ కోర్టు దోషిగా తేల్చింది. పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. తీర్పు వెలువడిన మూడు రోజుల తర్వాత (జనవరి 13న) లోక్‌సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటు వేస్తూ ప్రకటన జారీ చేసింది. ఫైజల్‌ (Mohammad Faizal) కేరళ హైకోర్టును ఆశ్రయించడంతో... సెషన్స్‌ కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో ఆయనపై పడిన అనర్హత వేటు చెల్లుబాటు కాకుండా పోయింది. అయినప్పటికీ.. ఫైజల్‌ సభ్యత్వాన్ని లోక్‌సభ సచివాలయం పునరుద్ధరించలేదు. దీన్ని సవాల్‌ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై నేడు సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో.. ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడం గమనార్హం.

కాగా.. కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) లోక్‌సభ సభ్యత్వ అనర్హతపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్‌ గాంధీ కేసులో ఇది ప్రభావం చూపించనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు