పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు.. టీ20 వరల్డ్‌ కప్‌ విజయంపై టీమ్‌ఇండియాకు అభినందనలు

నేడు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా సభ్యులంతా భారత క్రికెట్‌ జట్టుకు అభినందనలు తెలియజేశారు. 

Updated : 01 Jul 2024 12:18 IST

దిల్లీ: టీ20 వరల్డ్‌ కప్‌ 2024 (T20 World Cup 2024) టైటిల్ సొంతం చేసుకున్న భారత క్రికెట్‌ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో టీమ్‌ఇండియా ప్రస్తావన వచ్చింది. మన జట్టుకు ఎంపీలంతా అభినందనలు తెలియజేశారు. తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది. 

ఈ సందర్భంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నీట్ అవకతవకల అంశాన్ని లేవనెత్తారు. ఈ విషయంపై తాము వాయిదా తీర్మానం కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. నీట్ లీకేజీ విషయంలో విద్యార్థులు ఆందోళనతో ఉన్నారని, వారికి పార్లమెంట్ నుంచి భరోసా కల్పిస్తూ సందేశాన్ని ఇవ్వాల్సిఉందన్నారు. అయితే ప్రస్తుత సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు, శూన్య గంటలు లేవు కాబట్టి, వాయిదా తీర్మానాలు తీసుకోవడం కుదరదని విపక్ష సభ్యులకు స్పీకర్ తెలియజేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే సమయంలో వాయిదా తీర్మానాలు తీసుకునేందుకు నిబంధనలు అంగీకరించవని వెల్లడించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. ధన్యవాద తీర్మానం తర్వాత అవసరం అనుకుంటే.. నీట్ అంశాన్ని లేవనెత్తొచ్చని చెప్పారు. దాంతో ధన్యవాద తీర్మానంపై భాజపా సభ్యుడు అనురాగ్ ఠాగూర్ చర్చను ప్రారంభించారు. నీట్‌ వ్యవహారంపై ప్రత్యేకంగా ఒకరోజు చర్చకావాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ నుంచి విపక్షాలు వాకౌట్‌ చేశాయి.

రాహుల్ మైక్‌ మ్యూట్‌పై విపక్షాల ఆందోళన

శుక్రవారం రాహుల్‌గాంధీ మాట్లాడుతున్న సమయంలో మైక్‌ ఆగిపోవడంపై కాంగ్రెస్‌ ఎంపీలు లోక్‌సభలో ఆందోళన చేపట్టారు. దానిపై స్పీకర్ స్పందిస్తూ.. మైక్ నిర్వహణ వ్యవహారం సభాపతి స్థానంలో ఉన్నవారి చేతుల్లో ఉండదని ఓం బిర్లా స్పష్టంచేశారు. అలాగే కాంగ్రెస్ ఎంపీ సురేశ్‌ కూడా కొన్నిసార్లు సభాపతి స్థానంలో కూర్చున్న విషయాన్ని గుర్తుచేశారు. మైక్‌ పనిచేయడం స్పీకర్ చేతిలో ఉంటుందని సురేశ్‌ చెప్తే తాను కూడా నమ్ముతానని ఆయన అన్నారు. ఈ వివరణతో కాంగ్రెస్ నేతలు ఆందోళనను విరమించారు.

అదేవిధంగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ధన్యవాద తీర్మానంపై మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగంలో పేదలు, దళితులు, మైనార్టీల ప్రస్తావన లేదని ఆక్షేపించారు. అందులో ఎలాంటి విజన్ కనిపించలేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని