Parliament: విగ్రహాలను తొలగించలేదు.. తరలించాం

పార్లమెంటు సముదాయంలో ఏర్పాటుచేసిన ప్రముఖుల విగ్రహాలలో దేనినీ తొలగించలేదని, వాటన్నింటినీ ఇదే ప్రాంగణంలో కొత్త ప్రదేశానికి మార్చామని 17వ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా స్పష్టంచేశారు.

Updated : 17 Jun 2024 06:24 IST

ఇలాంటి నిర్ణయాలు స్పీకర్‌ పరిధిలోకి వస్తాయి 
ఇందులో రాజకీయాలు అనవసరం: ఓం బిర్లా 

దిల్లీ: పార్లమెంటు సముదాయంలో ఏర్పాటుచేసిన ప్రముఖుల విగ్రహాలలో దేనినీ తొలగించలేదని, వాటన్నింటినీ ఇదే ప్రాంగణంలో కొత్త ప్రదేశానికి మార్చామని 17వ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా స్పష్టంచేశారు. పార్లమెంటు ప్రాంగణాన్ని సుందరీకరించి, పలు కోణాల్లో మెరుగుపరిచే చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇలాంటివన్నీ స్పీకర్‌ కార్యాలయం పరిధిలోకే వస్తాయని చెప్పారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘స్వాతంత్య్ర సమరయోధులు, ఇతర ప్రముఖుల విగ్రహాలను ప్రేరణాస్థల్‌కు తరలించేముందు అన్ని వర్గాలతో ఎప్పటికప్పుడు చర్చించాం. ఒక్క విగ్రహాన్నీ తీసేయలేదు. అందువల్ల దానిపై రాజకీయాలు అనవసరం. అన్నింటినీ ఒక్కచోట చేరిస్తే వారివారి జీవితచరిత్ర, సాధించిన విజయాలపై సమాచారాన్ని ప్రజలు మెరుగ్గా తెలుసుకోగలరనే అభిప్రాయం అనేకమందిలో ఉండేది. అందుకే పార్లమెంటు పాత భవనం, గ్రంథాలయం మధ్యనున్న ప్రేరణాస్థల్‌కు వాటిని తరలించాం. ఈ స్థలంలో ఏడాది పొడవునా సందర్శకులను అనుమతిస్తాం. జాతి నిర్మాణానికి మహనీయులు చేసిన కృషికి గుర్తింపుగా వారి జయంతి, వర్థంతిలను ఇక్కడ నిర్వహిస్తాం. సందర్శకులు సులభంగా నివాళులర్పించేలా విగ్రహాల చుట్టూ పచ్చదనాన్ని తీర్చిదిద్దాం’’ అని ఓం బిర్లా వివరించారు. వీరి జీవిత చరిత్ర, సందేశాలను సందర్శకులు క్యూఆర్‌ కోడ్‌ ద్వారా తెలుసుకోగలిగేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. పార్లమెంటు నూతన భవన నిర్మాణ సమయంలో గాంధీ, నెహ్రూ, దేవీలాల్‌ విగ్రహాలను తరలించామని గుర్తుచేశారు. ఒకే విభాగానికి జవాబుదారీతనం నిర్ణయించేలా పార్లమెంటు సముదాయం మొత్తం భద్రతను సీఐఎస్‌ఎఫ్‌కు అప్పగించినట్లు చెప్పారు. ఇతర ప్రాంగణాల భద్రతకు, ఎంపీలతో వ్యవహరించడానికి మధ్య తేడా ఉన్నందువల్ల దానికి తగ్గ శిక్షణను సీఐఎస్‌ఎఫ్‌కు ఇస్తున్నట్లు తెలిపారు.

..అది ఏకపక్షం: కాంగ్రెస్‌

పార్లమెంటులో మహనీయుల విగ్రహాల తరలింపు పూర్తి ఏకపక్షమని కాంగ్రెస్‌ విమర్శించింది. ఎవరితో చర్చించకుండా ఇలా చేయడం పార్లమెంటు నిబంధనలకు, సంప్రదాయాలకు విరుద్ధమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది తూట్లు పొడుస్తోందన్నారు. పార్లమెంటు ఆవరణలోని 50 విగ్రహాలకు ఎంతో ప్రాధాన్యం ఉందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశమయ్యే స్థలానికి ఆనుకుని ఉన్నచోట మహాత్మా గాంధీ, అంబేడ్కర్‌ విగ్రహాలు గతంలో ఉండేవని, అక్కడ ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు వ్యక్తంచేస్తూ రావడం ఎప్పటినుంచో ఉందని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ గుర్తుచేశారు. అందువల్ల ఆ రెండు విగ్రహాలు అక్కడ ఉండకూడదనేది అధికారపక్షం ఏకైక ఉద్దేశమని చెప్పారు. విగ్రహాలపై పార్లమెంటు కమిటీ చిట్టచివరిసారిగా 2018 డిసెంబరు 18న సమావేశమైందని, ఆ తర్వాత కమిటీనే ఏర్పాటు చేయలేదని లోక్‌సభ వెబ్‌సైట్లో ఉందని తెలిపారు. గాంధీ విగ్రహాన్ని వాస్తవంగా రెండుసార్లు మార్చారని ‘ఎక్స్‌’లో వివరించారు. 

ప్రేరణా స్థల్‌ను ప్రారంభించిన ఉప రాష్ట్రపతి 

పార్లమెంటు సముదాయంలోని ప్రేరణా స్థల్‌ను ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ ప్రాంగణం ప్రజలకు ప్రేరణ అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ప్రారంభోత్సవం ద్వారా మహనీయులకు నివాళులర్పించే అవకాశం తనకు లభిస్తుందని ఎన్నడూ అనుకోలేదని చెప్పారు. కార్యక్రమానికి హాజరైన నేతలు ఆయా నాయకుల విగ్రహాల వద్ద నివాళులర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని