Lokayukta: లంచం కేసు.. అజ్ఞాతంలోనే భాజపా ఎమ్మెల్యే..!

లంచం కేసులో కర్ణాటక ఎమ్మెల్యే కుమారుడిని లోకాయుక్త (Lokayukta) ఇప్పటికే అరెస్టు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భాజపా ఎమ్మెల్యే విరూపాక్షప్ప (Virupakshappa) ఆచూకీ మాత్రం ఇంకా తెలియలేదు. మూడురోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఎమ్మెల్యేకు నోటీసులు ఇచ్చే యోచనలో అధికారులు ఉన్నారు.

Published : 06 Mar 2023 00:30 IST

బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటకలో (Karnataka) భాజపా ఎమ్మెల్యే కుమారుడు ప్రశాంత్‌ లంచం తీసుకుంటూ పట్టుబడటం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రశాంత్‌ను లోకాయుక్త (Lokayukta) అధికారులు ఇప్పటికే అరెస్టు చేసినప్పటికీ.. ఎమ్మెల్యే (BJP MLA) ఆచూకీ మాత్రం ఇంకా దొరకలేదు. లోకాయుక్త నమోదు చేసిన కేసులో ఎమ్మెల్యేనే ప్రధాన నిందితుడిగా ఉన్నారు. మూడు రోజులుగా ఆయన్ను పట్టుకునేందుకు అధికారులు చేసిన ప్రయత్నాల్లో పురోగతి మాత్రం కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేను (Virupakshappa) ప్రశ్నించేందుకుగాను నోటిసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు లోకాయుక్త అధికారులు పేర్కొన్నారు.

భారీగా బంగారం, భూమి దస్త్రాలు..

కర్ణాటకలో ఓ గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ భాజపా ఎమ్మెల్యే విరూపాక్షప్ప (Virupakshappa) కుమారుడు ప్రశాంత్‌ కుమారుడు లోకాయుక్తకు చిక్కారు. ఆయనతో పాటు ఐదుగురిని అరెస్టు చేశారు. ప్రశాంత్‌ ఇల్లు, కార్యాలయంలో సోదాలు జరపగా.. సుమారు రూ.8కోట్లకు పైగా నగదు లభ్యమైంది. ఎమ్మెల్యే ఇంట్లో జరిపిన సోదాల్లోనూ రూ.16.47లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు లోకాయుక్త అధికారులు వెల్లడించారు. నగదుతోపాటు పెద్ద ఎత్తున భూముల పెట్టుబడులకు సంబంధించి డాక్యుమెంట్లు, బంగారం, వెండి కూడా గుర్తించినట్లు లోకాయుక్త వర్గాలు వెల్లడించాయి.

ఈ కేసులో భాజపా ఎమ్మెల్యే విరూపాక్షప్పను ప్రధాన నిందితుడిగా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. ఎమ్మెల్యే తరఫునే ఆయన కుమారుడు లంచం తీసుకున్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎమ్మెల్యే ఆచూకీ మాత్రం దొరకడం లేదు. ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

రాజీనామా ఆమోదించని సీఎం..

కుమారుడు లంచం కేసులో చిక్కుకోవడంతో కేఎస్‌డీఎల్‌ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు విరూపాక్షప్ప ప్రకటించారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైకి రాజీనామా లేఖ రాశారు. అయితే, రాజీనామాపై మాత్రం సీఎం బొమ్మై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీనిపై లోకాయుక్త స్వతంత్ర దర్యాప్తు జరుపుతోందన్నారు. దీనిపై విపక్షాలు చేస్తోన్న ఆరోపణలపై స్పందించిన ముఖ్యమంత్రి బొమ్మై.. కాంగ్రెస్‌ హయాంలో అవినీతి, దోపిడీలు, హత్యలకు సంబంధించిన 59 కేసులు లోకాయుక్తకు బదిలీ అయ్యాయన్నారు. వీటిపై దర్యాప్తు జరుగుతుందని.. వాస్తవమేమిటో బయటకు వస్తుందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని