Parliament: శీతాకాల సమావేశాలు ముగింపు.. ఉభయ సభలు నిరవధిక వాయిదా

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు పూర్తయ్యాయి. కరోనా పరిస్థితులతో పాటు అజెండాలో చాలా వరకు అంశాలు పూర్తయిన నేపథ్యంలో ఉభయసభలను ఒకరోజు ముందుగానే

Updated : 22 Dec 2021 13:54 IST

దిల్లీ: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ముగిశాయి. కరోనా పరిస్థితులతో పాటు అజెండాలో చాలా వరకు అంశాలు పూర్తయిన నేపథ్యంలో ఉభయసభలను ఒకరోజు ముందుగానే ముగించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు సభలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బుధవారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రకటించారు. 

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నవంబరు 29న ప్రారంభమయ్యాయి. షెడ్యూల్‌ ప్రకారం డిసెంబరు 23 వరకు కొనసాగాల్సి ఉంది. అయితే కరోనా పరిస్థితులు, ఇతర అంశాల దృష్ట్యా ఒకరోజు ముందుగానే ముగించారు. ఈ సమావేశాలకు సోమవారం వరకు హాజరైన బీఎస్పీ ఎంపీ కున్వార్‌ డానిష్‌ అలీ నిన్న కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.  

శీతాకాల సమావేశాల్లో భాగంగా కీలక సాగు చట్టాల రద్దుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. సమావేశాల తొలి రోజైన నవంబరు 29న సాగు చట్టాల రద్దుకు సంబంధించి బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టినా స్పీకర్‌ అందుకు అంగీకరించలేదు. అనంతరం మూజువాణి ఓటు ద్వారా బిల్లుకు దిగువసభ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత అదే రోజున రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. ఇక, ఓటరు జాబితా వివరాలను ఆధార్‌ వ్యవస్థతో అనుసంధానించడానికి ఉద్దేశించిన కీలక ఎన్నికల చట్టాల సవరణ బిల్లు-2021కు కూడా ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. దీంతో పాటు యువతుల వివాహ వయసు పెంపునకు ఉద్దేశించిన బిల్లును నిన్న లోక్‌సభలో ప్రవేశపెట్టగా.. ప్రతిపక్షాల అభ్యంతరాలతో ఈ బిల్లును స్థాయీ సంఘానికి పంపడానికి ప్రభుత్వం అంగీకరించింది. 

వాయిదాల పర్వమే..

మరోవైపు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే రాజ్యసభలో 12 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. గత సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించినందుకుగానూ వీరిపై వేటు వేశారు. అయితే ఈ వ్యవహారం తీవ్ర నిరసనలకు దారితీసింది. ఎంపీల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ ప్రతిరోజూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో సభలో నిరంతరం వాయిదాల పర్వం కొనసాగింది. సభలో సభ్యుల ప్రవర్తనపై  ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. అటు లోక్‌సభలోనూ దాదాపు అదే పరిస్థితి కన్పించింది. లఖింపుర్‌ ఖేరీ ఘటన, ఇతర అంశాలపై విపక్ష సభ్యులు పదేపదే ఆందోళనలు చేపట్టారు. వారి నిరసనల నడమే పలు బిల్లులు ఎలాంటి చర్చ లేకుండా ఆమోదం పొందాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని