COVID-19: దీర్ఘకాల కరోనా అత్యంత ప్రమాదకరం.. ప్రతి శరీరభాగంపై ప్రభావం!

కొవిడ్‌ సోకినప్పటికీ.. లక్షణాలు లేవని అలసత్వం వహించొద్దని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. కరోనా నియంత్రణకు జాగ్రత్తలు తీసుకోకపోతే......

Updated : 15 Feb 2022 06:06 IST

తాజా అధ్యయనంలో వెల్లడి

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌ సోకినప్పటికీ.. లక్షణాలు లేవని అలసత్వం వహించొద్దని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. కరోనా నియంత్రణకు జాగ్రత్తలు తీసుకోకపోతే అది దీర్ఘకాలంగా ఉండి అత్యంత ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ దీర్ఘకాలిక ప్రభావాలు మానవ శరీరంలోని ప్రతి భాగంపై ప్రభావితం చూపే అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గతవారం వెల్లడించింది. అనేక అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. యూరోపియన్ కాంగ్రెస్ ఆఫ్ క్లినికల్ మైక్రోబయాలజీ అండ్‌ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఇటీవలి అధ్యయనం ఈ విషయాలను ఎత్తి చూపుతోంది. గుండె, ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థ తదితర అవయవాలపై వైరస్ దాడి చేస్తూ ప్రాణాంతక వ్యాధుల బారిన పడేస్తుందని పేర్కొంటోంది.

శరీరంలోని అత్యంత ముఖ్యమైన బహుళ ఫంక్షనల్ నాడీ వ్యవస్థ ‘వాగస్‌’పై దీర్ఘకాల కొవిడ్‌ అధిక ప్రభావం చూపుతోందని తాజా అధ్యయనం పేర్కొంది. మెదడులో నుంచి నడుము వరకు విస్తరించి ఉండే వాగస్‌ నాడీ వ్యవస్థ.. గుండె, ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థ పనితీరును నియంత్రిస్తుంది. హృదయ స్పందనలు, మాట్లాడటం, నోటి నుంచి కడుపులోకి ఆహారాన్ని పంపించే ప్రక్రియలపై ప్రభావం చూపుతుంది. దీర్ఘకాల కరోనా కారణంగా నరాలు గట్టిపడిపోవడం, ఆహారం మింగడంలో ఇబ్బందులు తలెత్తడం, శ్వాస తీసుకోవడంలో ఆటంకాలు, రాత్రి చెమటలు పట్టడం, జీర్ణక్రియ సరిగా కాకపోడం వంటి సమస్యలు ఏర్పడుతున్నట్లు ఈ అధ్యయనం పేర్కొంది.

కొవిడ్‌ కొద్దిరోజులే ఉన్నప్పటికీ.. గుండె పనితీరుపై అధికంగానే ప్రభావం చూపుతున్నట్లు తేలింది. ఏడాది పాటు గుండె సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 65 ఏళ్ల లోపువారితోపాటు.. ఊబకాయం, మధుమేహం వంటి రుగ్మతలు లేనివారికి కూడా ఈ ప్రమాదం పెరిగినట్లు వెల్లడైంది. యువకులు, ధూమపానం అలవాటు లేనివారికి కూడా ఇలాంటి సమస్యలు తలెత్తినట్లు తేలింది. ‘కరోనా సోకి కోలుకున్న తర్వాత గతేడాదిలో 20 శాతం మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడ్డారు. వైరస్‌ సోకనివారితో పోలిస్తే వీరిలో గుండెపోటు వచ్చే అవకాశం 52 శాతం అధికంగా ఉన్నట్లు గుర్తించాం’ అని అధ్యయన బృందంలోని ఓ శాస్త్రవేత్త వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని