Pahalgam Encounter: అమర్‌నాథ్‌ యాత్ర మార్గంలో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూ- కశ్మీర్‌లో తాజాగా మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది. అమర్‌నాథ్‌ యాత్ర మార్గంలో కీలక ప్రాంతమైన అనంతనాగ్‌ జిల్లాలోని పహల్‌గామ్‌లో శుక్రవారం భద్రతాబలగాలు.. ముగ్గురు తీవ్రవాదులను కాల్చిచంపాయి. యాత్రామార్గంలో ఉగ్ర దాడులను...

Published : 06 May 2022 18:45 IST

శ్రీనగర్‌: జమ్మూ- కశ్మీర్‌లో తాజాగా మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది. అమర్‌నాథ్‌ యాత్ర మార్గంలో కీలక ప్రాంతమైన అనంతనాగ్‌ జిల్లాలోని పెహల్గామ్‌లో శుక్రవారం భద్రతా బలగాలు.. ముగ్గురు తీవ్రవాదులను కాల్చిచంపాయి. యాత్రామార్గంలో ఉగ్ర దాడులను అరికట్టే క్రమంలో నేటి ఎన్‌కౌంటర్ పెద్ద విజయమని పోలీసులు పేర్కొన్నారు. మృతి చెందిన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకరు హిజ్బుల్ ముజాహిదీన్‌ ఉగ్ర సంస్థలో చాలా ఏళ్లుగా ఉన్న వ్యక్తి అని తెలిపారు. దక్షిణ కశ్మీర్‌లోని పర్యాటక కేంద్రమైన పహల్‌గామ్‌.. అమర్‌నాథ్ యాత్ర బేస్ క్యాంప్‌లలో ఒకటి.

‘హిజ్బుల్‌ ముజాహిదీన్‌లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతోన్న ఉగ్రవాదుల్లో ఒకరైన అష్రఫ్ మోల్వితోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. యాత్ర మార్గంలో చేపట్టిన ఈ ఆపరేషన్ మాకు పెద్ద విజయం’ అని కశ్మీర్‌ ఐజీపీ విజయ్ కుమార్ అన్నారు. అంతకుముందు పెహల్గామ్‌లోని ఓ అడవిలో ఉగ్రవాదుల కదలికలపై విశ్వసనీయ సమాచారం అందడంతో.. భద్రతా దళాలు ఈ మేరకు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిపై కాల్పులు జరపడంతో.. ఈ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారిందని వివరించారు.

రెండేళ్ల తర్వాత జూన్ 30 నుంచి ప్రారంభం కానున్న అమర్‌నాథ్‌ యాత్రను లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు చేసిన ఓ కుట్రను బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది ఇటీవల భగ్నం చేసిన విషయం తెలిసిందే. జమ్మూ- కశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద చాక్‌ ఫఖీరా బోర్డర్‌ అవుట్‌పోస్ట్‌కు సమీపంలో ఓ రహస్య సొరంగాన్ని గుర్తించారు. అమర్‌నాథ్‌ యాత్రకు భంగం కలిగించేందుకు ముష్కరులు ఈ సొరంగం ద్వారా పాక్‌ నుంచి భారత భూభాగంలోకి చొరబడేలా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోందని బీఎస్‌ఎఫ్‌ డీఐజీ ఎస్‌పీఎస్‌ సంధు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని