Modi-Putin: ఆ స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకుంటాం: రష్యా పర్యటనకు బయల్దేరిన మోదీ

ప్రధాని నరేంద్రమోదీ (Modi) నేడు రష్యా పర్యటనకు బయల్దేరారు. 

Updated : 08 Jul 2024 11:55 IST

దిల్లీ: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు బయల్దేరారు. ఈసందర్భంగా ఇద్దరు నేతలు 22వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఈసందర్భంగా పలు అంశాలపై వ్యూహాత్మక చర్చలు జరపనున్నారు. మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా రష్యాతో పాటు ప్రధాని ఆస్ట్రియాకు వెళ్తారు. బయల్దేరడానికి ముందు మోదీ ఎక్స్‌(ట్విటర్) వేదికగా స్పందించారు. 

‘‘రానున్న మూడు రోజులు రష్యా, ఆస్ట్రియాలో పర్యటిస్తాను. కాలం పెట్టిన పరీక్షలకు నిలిచిన స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ సందర్శనలు ఉపయోగపడనున్నాయి. అలాగే అక్కడి ప్రవాస భారతీయులతో మాట్లాడేందుకు వేచి చూస్తున్నా’’ అని తెలిపారు.

మోదీ పర్యటనపై రష్యాలో భారత రాయబారి వినయ్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. ‘‘వార్షిక సదస్సులో భాగంగా ఈ పర్యటన జరుగుతోంది. రెండు దేశాల ద్వైపాక్షిక అంశాలకే ఈ భేటీలో ప్రాధాన్యం ఉంటుంది’’ అని చెప్పారు. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, శాస్త్ర, సాంకేతిక పరిశోధన వంటి రంగాలపై దృష్టి సారించనున్నట్టు తెలిపారు. ఈ చర్చల ద్వారా చెప్పుకోదగ్గ స్థాయి ఫలితాలు ఉండొచ్చని విశ్వాసం వ్యక్తంచేశారు. ఇదిలా ఉంటే.. 40 ఏళ్ల కాలంలో ఆస్ట్రియాలో పర్యటిస్తోన్న తొలి ప్రధాని మోదీనే కావడం విశేషం.

భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఎంతో ముఖ్యమైందని, పూర్తిస్థాయిలో సాగనుందని, అధ్యక్షుడు పుతిన్‌తో శిఖరాగ్ర స్థాయి చర్చలు జరగనున్నాయని రష్యా పేర్కొంది. ఈ పర్యటనపై పాశ్చాత్య దేశాలు ఈర్ష్యగా ఉన్నాయని అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని