దేశసేవలో ప్రాణత్యాగం.. ఒకే కుటుంబంలో రెండు నెలల్లో ఇద్దరు అమరులై!

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు.. రెండు నెలల వ్యవధిలోనే దేశ సేవలో ప్రాణాలు కోల్పోయారు.

Published : 09 Jul 2024 23:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ సైనిక కుటుంబానికి తీరని విషాదమిది. రెండు నెలల క్రితమే సైన్యంలో మేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఇంటి సభ్యుడు దేశసేవలో ప్రాణాలు కోల్పోగా.. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని (Jammu Kashmir) కథువాలో చోటుచేసుకున్న ఉగ్రదాడిలో మరొకరు అమరులయ్యారు. వారే.. ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రణయ్‌ నేగీ (33) (Pranay Negi), ఆదర్శ్‌ నేగీ (26) (Adarsh Negi). వీరిద్దరూ వరుసకు సోదరులు.

  • రెజిమెంట్‌ ఆఫ్‌ ఆర్టిలరీ యూనిట్‌కు చెందిన మేజర్‌ ప్రణయ్ నేగి లేహ్‌లో దేశ భద్రత విధులు నిర్వహిస్తూ.. ఏప్రిల్‌ 30న తుదిశ్వాస విడిచారు. ఆ విషాదం నుంచి కోలుకోకముందే ఆ కుటుంబానికి ఆదర్శ్‌ నేగీ మరణం రూపంలో మరో షాక్‌ తగిలింది. కథువా జిల్లాలో సైనిక వాహనంపై ఉగ్రవాదులు జరిపిన మెరుపుదాడిలో అయిదుగురు జవాన్లు అమరులు కాగా.. వారిలో ఆదర్శ్‌ ఒకరు. ఆయన 2018లో గాఢ్వాల్‌ రైఫిల్స్‌ యూనిట్‌లో చేరారు.
  • ‘‘రెండు నెలల క్రితమే మేజర్‌గా ఉన్న మా కుమారుడిని కోల్పోయాం. ఇప్పుడు మరొకరు అమరులయ్యారు. ఆదర్శ్‌ చాలా చురుకైన వ్యక్తి. ఆదివారమే అతడితో మాట్లాడాం. భోజనం చేస్తున్నానని, విధులకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నానని చెప్పాడు. అంతలోనే ఘోరం జరిగిపోయింది’’ అని కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని