
Parliament: చర్చల్లేవ్.. రచ్చ మాత్రమే: ఉభయ సభలు మళ్లీ వాయిదా!
దిల్లీ: విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ మరోసారి దద్దరిల్లింది. పెగాసస్, రైతు చట్టాలు తదితర అంశాలపై విపక్ష నేతల ఆందోళనలు శుక్రవారం సైతం కొనసాగాయి. దీంతో ఉభయ సభలూ ఎలాంటి చర్చలు జరగ్గకుండానే మరోసారి వాయిదా పడ్డాయి. ఇదే సమయంలో లోక్‌సభలో రెండు కీలక మైన బిల్లులకు ఆమోదం లభించింది. మళ్లీ పార్లమెంట్ ఉభయ సభలూ సోమవారం సమావేశం కానున్నాయి.
లోక్‌సభలో ఎప్పటిలానే విపక్ష సభ్యుల ఆందోళనలు కొనసాగాయి. ఉదయం స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలను చేపట్టగా.. విపక్ష సభ్యులు పెగాసస్ స్పైవేర్, వ్యవసాయ చట్టాల అంశాలపై నినాదాలు చేశారు. సీట్లలో కూర్చోవాలని సభ్యులను ఎంత వారించినా వినకపోవడంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మధ్యాహ్నం మరోసారి దిగువ సభ సమావేశమైంది. రాజేంద్ర అగర్వాల్ సభాధ్యక్షులుగా వ్యవహరించారు. ఇదే సమయంలో ప్రభుత్వం రెట్రోస్పెక్టివ్ పన్ను విధానం రద్దుకు ఉద్దేశించిన ‘ద టాక్సేషన్ లాస్ (అమెండ్‌మెంట్) బిల్, 2021’ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. విపక్షాల ఆందోళన నడుమే మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. అలాగే లద్దాఖ్‌లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు వీలుకు ఉద్దేశించిన కేంద్ర విశ్వవిద్యాలయాల (సవరణ) బిల్లుకు 2021కు సైతం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ రెండు బిల్లుల ఆమోదం అనంతరం సభ వాయిదా పడింది.
మరోవైపు రాజ్యసభలో అదే సీన్ కనిపించింది. ఇక్కడ కూడా పెగాసస్, రైతు చట్టాల అంశాలపై విపక్షాల నిరసనలు కొనసాగాయి. ఉదయం సభ ప్రారంభమైన కొద్ది సేపటికే విపక్షాల ఆందోళనతో సభ కాసేపు వాయిదా పడి తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది. కాంగ్రెస్, తృణమూల్ సభ్యుల ఆందోళనలతో సభను కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో సభాధ్యక్షులుగా వ్యవహరించిన సురేంద్ర సింగ్ తదుపరి రోజుకు వాయిదా వేశారు. శని, ఆదివారాలు వారాంతపు సెలవులు కావడం ఉభయ సభలూ మళ్లీ సోమవారం సమావేశం కానున్నాయి. జులై 19న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా చర్చలకు నోచుకోకపోవడం గమనార్హం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.