Kejriwal: లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మా ‘హెడ్‌మాస్టర్‌’ కాదు: కేజ్రీవాల్‌

దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమకు హెడ్‌మాస్టర్‌ కాదని ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను ఆమోదించడమో లేదా తిరస్కరించడమో చేయాలి తప్పితే సొంత నిర్ణయాలు తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ర్యాలీ నిర్వహించారు.

Published : 16 Jan 2023 23:12 IST

దిల్లీ: దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (LG)కి అక్కడి అధికార ఆమ్‌ఆద్మీ (AAP) ప్రభుత్వానికి మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. శిక్షణ కోసం టీచర్లను విదేశాలకు పంపించడానికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు అభ్యంతరం ఏంటి అని ప్రశ్నిస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో (Kejriwal) కూడిన ప్రజా ప్రతినిధుల బృందం ఎల్జీ కార్యాలయం ముందు నిరసన తెలిపింది. ఎల్జీ సొంతంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదని.. కానీ, ఆయన అలాగే చేస్తున్నారని ఆరోపించింది. ఇదే అంశంపై దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా, ఆప్‌కు చెందిన ఎమ్మెల్యేలతో కలిసి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రయత్నించారు.

‘మా పనిని పరిశీలించేందుకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మా హెడ్‌మాస్టర్‌ కాదు. మేం పంపించిన ప్రతిపాదనలను ఆమోదించడమో లేదా తిరస్కరించడమో చేయాలి. కానీ, ఎల్జీ మాత్రం సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి, ఇతర ఎమ్మెల్యేలు ఆయన కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడం దురదృష్టకరం. ఆయన తప్పిదాన్ని తెలుసుకుంటారని ఆశిస్తున్నాం. ఇప్పటికైనా ఫిన్లాండ్‌లో శిక్షణ కోసం తమ ఉపాధ్యాయులను పంపించేందుకు అంగీకరిస్తారని భావిస్తున్నాం’ అని అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. రాజకీయ కారణాలతోనే దిల్లీ ప్రభుత్వ పనులను అడ్డుకుంటున్నారని ఆరోపించిన ఆయన.. నిర్ణయాలు తీసుకునే అధికారం లేనప్పుడు ఎన్నికైన ప్రభుత్వం ఎలా విధులు నిర్వర్తిస్తుందని ప్రశ్నించారు.

అయితే, ఎల్జీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన సీఎం కేజ్రీవాల్‌ బృందాన్ని.. కొద్ది దూరంలోనే పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఎల్జీ కార్యాలయం నుంచి సమాచారం రావడంతో తిరిగి అసెంబ్లీకి వెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై త్వరలోనే ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎంలతో సమావేశమవుతానని ఎల్జీ సక్సేనా హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే, విద్యా ప్రమాణాలను పెంచడంలో భాగంగానే తమ ఉపాధ్యాయులను విదేశాలకు పంపించి శిక్షణ ఇప్పిస్తున్నామని ఆప్‌ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని