Lumpy Disease: పశువులను పీడిస్తోన్న ‘లంపీ’ డిసీజ్‌.. రాజస్థాన్‌లోనే 12వేల మూగజీవాలు మృతి

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని పశువులను లంపీ చర్మవ్యాధి (Lumpy Disease) వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి కారణంగా కేవలం ఒక్క రాజస్థాన్‌లోనే 12వేల మూగజీవాలు మృత్యువాత పడ్డాయి.

Published : 12 Aug 2022 02:12 IST

పశువుల సంతలపై నిషేధం విధించిన రాజస్థాన్‌

జైపూర్‌: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని పశువులను లంపీ చర్మవ్యాధి (Lumpy Disease) వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి కారణంగా కేవలం ఒక్క రాజస్థాన్‌లోనే 12వేల మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. దీంతో అప్రమత్తమైన రాజస్థాన్‌ (Rajasthan) ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో నిర్వహించే పశువుల సంతలపై (Animal Fairs) నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. రాజస్థాన్‌తోపాటు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో పశువులను లంపీ స్కిన్‌ డిసీజ్‌ వేధిస్తోంది.

ఐదు రాష్ట్రాల్లో వ్యాప్తి

రాజస్థాన్‌లో ఇప్పటివరకు మొత్తం 2,81,484 పశువులకు లంపీ చర్మవ్యాధి (Lumpy Disease) సోకగా వాటిలో 2,41,685 పశువులకు చికిత్స అందించినట్లు అక్కడి ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో ఆగస్టు 10 నాటికి మొత్తంగా 12,800 పశువులు మృతి చెందగా.. శ్రీ గంగానగర్‌లోనే అత్యధికంగా 2511 పశువులు మరణించాయి. బార్మెర్‌లో 1619, జోధ్‌పూర్‌లో 1581, బికనెర్‌లో 1156, జరోల్‌లో 1150 పశువులు లంపీ స్కిన్‌ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోయాయి. ఇప్పటివరకు ఐదు జిల్లాల్లోనే వ్యాధి తీవ్రత అధికంగా ఉందని.. అయినప్పటికీ ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని రాజస్థాన్‌ పశుసంవర్ధక శాఖ కార్యదర్శి పీసీ కిషన్‌ వెల్లడించారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న ఆయన.. రాష్ట్రవ్యాప్తంగా పశువుల సంతలపై (Animal Fairs) నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఈ వ్యాధి (Lumpy Disease) ప్రాబల్యం అత్యధికంగా రాజస్థాన్‌లో ఉండగా.. గుజరాత్‌, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, అండమాన్‌ నికోబార్‌, ఉత్తరాఖండ్‌లలోనూ వందల సంఖ్యలో పశు మరణాలు సంభవిస్తున్నట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడిస్తున్నాయి.

ఏమిటీ వ్యాధి..?

పశువుల్లో కాప్రిపాక్స్‌వైరస్‌ (Capripoxvirus) కారణంగా లంపీ స్కిన్‌ వ్యాధి సంభవిస్తుంది. ఇది గోట్‌పాక్స్‌ (Goatpox), షీప్‌పాక్స్‌ (Sheeppox) కుటుంబానికి చెందిన వైరస్‌. ఈ వైరస్‌ సోకిన పశువులు జ్వరం బారినపడడంతోపాటు వాటి చర్మంపై గడ్డలు ఏర్పడుతాయి. వాటిపై రక్తాన్ని పీల్చే దోమలు, పురుగులు వాలి కుట్టినప్పుడు తీవ్ర రక్తస్రావం అవుతుంది. అనంతరం కొన్ని రోజుల్లోనే బరువు కోల్పోవడంతోపాటు పాల దిగుబడి తగ్గిపోతుంది. వీటికితోడు శ్వాస, లాలాజల స్రావాలు కూడా మరింత ఎక్కువై పశువుల మరణానికి దారితీస్తుంది. ఇప్పటివరకు దీనికి ఎటువంటి చికిత్స లేనప్పటికి వ్యాధి నుంచి పశువులకు ఉపశమనం కలిగించేందుకు యాంటీబయోటిక్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఇలా పశువుల్లో ప్రాణాంతకంగా మారిన ఈ వ్యాధి (Lumpy Disease) ప్రపంచ వ్యాప్తంగా మూగజీవాలను వేధిస్తోందని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.

త్వరలో టీకా..?

ఇలా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పశువుల్లో తీవ్రంగా వ్యాపిస్తున్న లంపీ చర్మవ్యాధికి భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR)కు చెందిన రెండు సంస్థలు స్వదేశీ టీకాను అభివృద్ధి చేశాయి. ఈ టీకాను వీలయినంత త్వరలో ఉత్పత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ఐసీఏఆర్‌ పరిధిలోని జాతీయ అశ్వ పరిశోధన కేంద్రం (హిసార్‌, హరియాణా), భారత పశువైద్య పరిశోధన సంస్థ (ఇజ్జత్‌నగర్‌, ఉత్తర్‌ప్రదేశ్‌)లు ‘లంపీ-ప్రోవాక్‌ఇండ్‌’ (Lumpi-ProVacInd) టీకాను అభివృద్ధి చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పేర్కొంది. వీటిని సాధ్యమైనంత తొందరగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి జరుగుతోందని వెల్లడించింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని