Venkaiah Naidu: ఆ రోజు నా కళ్లలో నీళ్లు తిరిగాయి: వెంకయ్యనాయుడు భావోద్వేగ ప్రసంగం

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజ్యసభలో భావోద్వేగ ప్రసంగం చేశారు. తన పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో రాజ్యసభ ఛైర్మన్‌ హోదాలో చివరి ప్రసంగం.....

Updated : 08 Aug 2022 19:10 IST

దిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజ్యసభలో భావోద్వేగ ప్రసంగం చేశారు. తన పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో రాజ్యసభ ఛైర్మన్‌ హోదాలో చివరి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా సభ గౌరవాన్ని కాపాడేలా వ్యవహరించాలని సభ్యులకు సూచించడంతో పాటు తన అనుభవాలనూ పంచుకున్నారు. ‘‘సభ్యులు సభ గౌరవాన్ని కాపాడేలా ఉండాలి. సభా కార్యకలాపాల్ని ప్రజలందరూ గమనిస్తుంటారు. సభ గౌరవం కాపాడటంలో భాగంగా కొన్నిసార్లు కఠినంగా ఉండాలి. పార్లమెంటరీ ప్రొసీడింగ్స్‌ అమలులో నిక్కచ్చిగా వ్యవహరించాలి. ఏ పార్టీకి చెందిన సభ్యులపైనా తప్పుడు అభిప్రాయాలు ఉండవు. నాయకులకు శత్రువులు ఎవరూ ఉండరు.. ప్రత్యర్థులే ఉంటారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక వేళ భావోద్వేగానికి గురయ్యా. అభ్యర్థిగా నన్ను ఎన్నుకున్నట్టు పార్లమెంటరీ బోర్డు భేటీలో ప్రధాని చెప్పారు. క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. పార్టీకి రాజీనామా చేసినప్పుడు బాధ కలిగింది. నా కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. ఆ పదవి నేను అడగలేదు. పార్టీ ఇచ్చిన ఆదేశాలను శిరసావహించి పార్టీకి రాజీనామా చేశాను.  పార్టీని వదిలి వెళ్తున్నాననే బాధ వెంటాడింది.

నా కర్తవ్యాన్ని నెరవేర్చా..

సభను సజావుగా నడపడంలో నా వంతు కర్తవ్యాన్ని నెరవేర్చా. సభలో అన్ని పార్టీల సభ్యులకూ సమాన అవకాశాలు ఇచ్చాను. సభ్యులు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి.. సభ విలువను పరిరక్షించాలి. పెద్దలు అందించిన ప్రజాస్వామ్య విలువల్నికాపాడాలి. పార్లమెంటు కార్యకలాపాలు ఎప్పుడూ సజావుగా సాగాలి. సభలో చర్చలు పక్కదోవపట్టకుండా చూడాలి. సభలో నిర్మాణాత్మక చర్చలు జరగాల్సి ఉంది. భారతీయ భాషలన్నింటినీ గౌరవించాలి. ప్రతి ఒక్కరూ మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలి. మాతృభాష తర్వాతే మరే భాషనైనా గౌరవించండి. ఎగువసభ సభ్యులు సభా గౌరవాన్ని కాపాడాలి. మన ప్రత్యర్థుల కంటే మెరుగ్గా పనిచేసి ముందుకెళ్లాలి తప్ప వారిని పడదోయాలనుకోకూడదు. పార్లమెంట్‌ కార్యకలాపాలు సజావుగా సాగాలని కోరుకుంటున్నా. మీ ప్రేమ, ఆప్యాయతలకు నేను కృతజ్ఞుడిని’’ అంటూ వెంకయ్యనాయుడు ఉద్వేగానికి లోనయ్యారు. 


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts