
Bipin-Madhulika: మధులిక.. సైనికసేవలో అంకితమై..
ఇంటర్నెట్ డెస్క్: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక మరణవార్త దేశవ్యాప్తంగా అందరినీ కలచివేసింది. మధులిక తండ్రి దివంగత రాజకీయ నేత మృగేంద్ర సింగ్. మధ్యప్రదేశ్‌లోని షాడోల్ వారి స్వస్థలం. దిల్లీలో సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేసిన మధులిక ఆ తరువాత సామాజిక సేవకు అంకితమయ్యారు. ముఖ్యంగా క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచారు. ఆర్మీలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల భార్యలు వివిధ వృత్తుల్లో రాణించేందుకు తోడ్పాటు అందించారు. స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ అందించి ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రోత్సహించారు. మధులిక ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కి ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు. వీర్ నారీస్ (ఆర్మీ వితంతువులు), దివ్యాంగ బాలల జీవితాల్లో వెలుగులు నింపారు. బిపిన్ రావత్, మధులిక దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఒకరు కృతిక రావత్, మరొకరు తరణి రావత్.