మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. నిందితుడి ఇంటిపైకి బుల్డోజర్‌..!

Madhya Pradesh Rape Horror: మధ్యప్రదేశ్ అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడి ఇంటిని కూల్చివేసేందుకు అధికారులు నిర్ణయించారు. అది అక్రమ కట్టడమని తేల్చినట్లు తెలిపారు.

Published : 03 Oct 2023 13:44 IST

భోపాల్: సభ్యసమాజం తలదించుకునే రీతిలో మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని ఉజ్జయిని (Ujjain)లో ఓ బాలికపై జరిగిన ఘోర అత్యాచార ఘటన (Rape Horror)లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన భరత్‌ సోని ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అయితే, ఉజ్జయినిలోని అతడి ఇంటిని అధికారులు కూల్చివేసేందుకు (Demolition) సిద్ధమయ్యారు. అది అక్రమ కట్టడమని అధికారులు చెబుతున్నారు.

నిందితుడు భరత్‌ సోని కుటుంబం కొన్నేళ్లుగా ప్రభుత్వ భూమిలో నివాసముంటున్నట్లు గుర్తించామని ఉజ్జయిని మున్సిపల్‌ కమిషనర్‌ రోషన్‌ సింగ్‌ వెల్లడించారు. అందుకే, కూల్చివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ‘‘వారు ఉంటున్న భూమి ప్రభుత్వానికి చెందినది. అందువల్ల కూల్చివేత కోసం ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. రాష్ట్ర పోలీసులతో కలిసి బుధవారం ఆ అక్రమ కట్టడాన్ని కూల్చివేయనున్నాం’’ అని మున్సిపల్‌ కమిషనర్‌ తెలిపారు.

ఆగని మృత్యుఘోష.. నాందేడ్‌ ఆసుపత్రిలో మరో ఏడుగురు రోగుల మృతి

అత్యాచారానికి గురైన ఆ బాలిక రక్తమోడుతూ, అర్ధనగ్నంగా వీధుల్లో తిరుగుతూ సాయం కోసం ప్రాధేయపడిన దృశ్యాలు సెప్టెంబరు 26 వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. చిన్నారి దీన స్థితిని పట్టించుకోకుండా స్థానికులు ఛీత్కరించుకోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దాదాపు రెండు గంటలపాటు ఆమె వందల ఇళ్లు, దాబాలు, టోల్ బూత్‌ల మీదుగా వెళ్లినా ఎవరూ సాయం చేయలేదు. చివరికి ఓ ఆలయ పూజారి ముందుకొచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

ఈ ఘటన వెలుగులోకి రాగానే.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు వందల మందిని విచారించారు. దాదాపు 700 కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను విశ్లేషించారు. అనంతరం ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న భరత్‌ సోనిని ప్రధాన నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. అతడిని విచారిస్తూ ఆధారాల సేకరణ కోసం ఘటనాస్థలికి తీసుకువెళ్లగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులు వెంటనే స్పందించి నిర్బంధించారు. అతడికి మరణ శిక్ష విధించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని