Delta Plus: మధ్యప్రదేశ్‌లో ఇద్దరి మృతి

కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ‘డెల్టా ప్లస్‌’ కలవరం సృష్టిస్తోంది. దేశంలో తీవ్రరూపం దాలుస్తున్నట్లే కనిపిస్తోంది. ఈ వేరియంట్‌తో తమ రాష్ట్రంలో తొలి మరణం సంభవించిందని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన కొద్ది గంటలకే.. మధ్యప్రదేశ్‌లో మరో ఇద్దరు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర అధికారులు పేర్కొన్నారు.

Published : 25 Jun 2021 22:36 IST

వారిద్దరూ ఒక్క డోసూ తీసుకోలేదన్న అధికారులు

భోపాల్‌: కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ‘డెల్టా ప్లస్‌’ కలవరం సృష్టిస్తోంది. దేశంలో తీవ్రరూపం దాలుస్తున్నట్లే కనిపిస్తోంది. ఈ వేరియంట్‌తో తమ రాష్ట్రంలో తొలి మరణం సంభవించిందని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన కొద్ది గంటలకే.. మధ్యప్రదేశ్‌లో మరో ఇద్దరు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర అధికారులు పేర్కొన్నారు. అయితే వీరిద్దరూ ఇప్పటివరకు ఒక్క టీకా డోసు కూడా తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఉజ్జయినిలో గత బుధవారం డెల్టా ప్లస్‌ వేరియంట్‌తో ఓ వ్యక్తి మృతి చెందినట్లు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం పేర్కొంది. అతడి నమూనాలు సేకరించి కొత్త వేరియంట్‌తోనే మరణించినట్లు నిర్ధరించింది. గత బుధవారం కొందరికి పరీక్షలు నిర్వహించగా మరో ఐదుగురికి డెల్టా ప్లస్‌ సోకినట్లు ప్రభుత్వం తెలిపింది. వారిలో ముగ్గురు భోపాల్‌కు చెందినవారు కాగా మరో ఇద్దరు ఉజ్జయిని వాసులు.

మధ్యప్రదేశ్‌లో డెల్టా ప్లస్‌తో మే 23న ఓ మహిళ మృతి చెందారు. ఈ వేరియంట్‌తో రాష్ట్రంలో మొట్టమొదటి మరణం ఇదేనని ఆ రాష్ట్ర కొవిడ్‌ నోడల్‌ అధికారి డా.రౌనక్‌ వెల్లడించారు. సదరు మహిళకంటే ముందే ఆమె భర్తకు కొవిడ్‌ సోకిందని, ఆయన టీకా రెండు డోసులు తీసుకోగా.. మృతురాలు ఒక్క డోసు కూడా తీసుకోలేదని వివరించారు. రాష్ట్రంలో డెల్టా ప్లస్‌ కేసులు పెరుగుతుండటంతో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వేరియంట్‌ బాధితులతో కాంటాక్ట్‌ అయినవారిని గుర్తించి వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రులను కూడా అప్రమత్తం చేశారు.

డెల్టా ప్లస్‌ వేరియంట్‌ దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటివరకు 52 కేసులు బయటపడినట్లు జాతీయ అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం (ఎన్‌సీడీసీ) డైరెక్టర్‌ సుజీత్‌ కుమార్‌ శుక్రవారం వెల్లడించారు. 18 జిల్లాల్లో ఈ కేసులు వెలుగు చూసినట్లు తెలిపారు. మహారాష్ట్రలో అత్యధికంగా 20 కేసులు బయటపడ్డాయి. శుక్రవారం తొలి మరణం కూడా సంభవించింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఓ వ్యక్తికి డెల్టా ప్లస్‌ నిర్ధరణ అయ్యింది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు