Corona: కరోనాపై సీఎం ఉద్ధవ్‌ సమీక్ష.. రైళ్లలో మాస్క్‌ మళ్లీ తప్పనిసరి చేస్తారా?

మహారాష్ట్రలో కరోనా కేసులు (corona virus) మళ్లీ పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు అనుసరించాల్సిన ....

Published : 25 Jun 2022 00:04 IST

ముంబయి: మహారాష్ట్రలో కరోనా కేసులు (corona virus) మళ్లీ పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) సీనియర్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. శుక్రవారం మహారాష్ట్రలో 4,205 కొత్త కేసులు రాగా.. వీటిలో ఒక్క ముంబయిలోనే 1898 మందిలో వైరస్‌ వెలుగుచూసింది. నగరంలో కొత్త కేసులు పెరుగుతున్న వేళ ముంబయి సబర్బన్‌ రైళ్లలో మళ్లీ మాస్క్‌ల తప్పనిసరి చేసే అవకాశాలపైనా సీఎంతో సమీక్షలో చర్చించారు. మహారాష్ట్ర రాజధాని ముంబయితో పాటు ఇతర నగరాల్లో కొవిడ్‌ కేసులు స్థిరంగా పెరుగుతుండటంతో సీఎం ఉద్ధవ్‌ఠాక్రే వర్చువల్‌గా సమీక్ష నిర్వహించినట్టు సీఎంవో కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. సబర్బన్‌ రైళ్లలో ప్రయాణికులకు తిరిగి మాస్క్‌లు తప్పనిసరి చేసే అవకాశాలపై చర్చించినట్టు పేర్కొంది.

వైరస్‌ వ్యాప్తిని నిలువరించడమే లక్ష్యంగా ముంబయి మెట్రోపాలిటన్‌ ప్రాంతం (ఎంఎంఆర్‌) పరిధిలో మాస్క్‌లు తప్పనిసరి చేసే అంశం పరిశీలనకు వచ్చినట్టు తెలిపింది. మహారాష్ట్రలో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టడంతో ఏప్రిల్‌ ప్రారంభంలో మాస్క్‌ తప్పనిసరి నిబంధనను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు, తాజాగా మళ్లీ కొవిడ్‌ విజృంభణ కొనసాగుతోంది. మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబయితో పాటు ఠానే, పుణె, రాయిగఢ్‌, పాల్ఘడ్‌ జిల్లాల్లో కేసుల పెరుగుదల కనబడుతోంది. దీంతో ప్రజలు తమంతట తాముగానే కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సీఎం ఉద్ధవ్‌ విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్రలో తాజాగా నమోదైన కేసులతో కలిపి అక్కడ క్రియాశీల కేసుల సంఖ్య 25వేలు దాటేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని