Uddhav: ప్రధానితో ఉద్ధవ్‌ ఠాక్రే భేటీ

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే మంగళవారం దిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాసానికి వెళ్లి ఆయనకు కలిశారు. మరాఠా రిజర్వేషన్లు, తుపాను సాయం

Published : 08 Jun 2021 12:46 IST

దిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే మంగళవారం దిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాసానికి వెళ్లి ఆయనకు కలిశారు. మరాఠా రిజర్వేషన్లు, తుపాను సాయం, టీకాలు తదితర అంశాలపై ఠాక్రే.. మోదీతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర సీఎం ఠాక్రే, ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధుల బృందం ఈ ఉదయం దిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఠాక్రే బృందం.. లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లోని ప్రధాని నివాసానికి చేరుకున్నారు. 

మరాఠా వర్గాన్ని సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గంగా ప్రకటించాలని గత నెల ఠాక్రే.. ప్రధానికి లేఖ రాశారు. మరాఠా రిజర్వేషన్ల కేసులో సుప్రీంకోర్టు ఇటీవల కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. మరాఠాలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడినట్లు స్పష్టమైన ఆధారాలేవీ లేవని, వారికి 16శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో 50శాతం పరిమితికి మించి రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. 

2018లో అప్పటి ఫడణవీస్‌ ప్రభుత్వం మరాఠాలను బీసీలుగా గుర్తించి 16 శాతం రిజర్వేషన్లు కల్పించింది. దీంతో మొత్తం రిజర్వేషన్లు 52 శాతం నుంచి 68%కి పెరగడంతో కొందరు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. మరాఠాలకు విద్యారంగంలో 13 శాతానికి, ఉద్యోగాల్లో 12 శాతానికి రిజర్వేషన్లు పరిమితం చేస్తూ తీర్పు వెలువరించింది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, మొత్తం రిజర్వేషన్లనే కొట్టివేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని