Vande Mataram: ఫోన్‌లో ‘హలో’కి బదులు.. ‘వందేమాతరం’ అనండి!

ప్రజల్లో జాతీయతా భావాన్ని పెంపొందించేలా మహారాష్ట్ర ప్రభుత్వం వినూత్న క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టింది. ఫోన్‌కాల్స్‌ వచ్చినప్పుడు అవతలి వ్యక్తిని పలకరించడానికి ప్రతిఒక్కరూ వాడే ‘హలో’కి బదులుగా ‘వందేమాతరం’ అనాలని అక్కడి ప్రజలకు విజ్ఞప్తి చేసింది....

Updated : 02 Oct 2022 17:58 IST

ముంబయి: ప్రజల్లో జాతీయతా భావాన్ని పెంపొందించేలా మహారాష్ట్ర ప్రభుత్వం వినూత్న క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టింది. ఫోన్‌కాల్స్‌ వచ్చినప్పుడు అవతలి వ్యక్తిని పలకరించడానికి ప్రతిఒక్కరూ వాడే ‘హలో’కి బదులుగా ‘వందేమాతరం’ అనాలని  ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు నిన్న ప్రభుత్వ అధికారులకు రిజల్యూషన్‌ జారీ చేసిన శిందే సర్కార్‌.. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆదివారం ఓ క్యాంపెయిన్‌నే మొదలుపెట్టింది. ఈ క్యాంపెయిన్‌ను వార్ధాలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ ప్రారంభించారు.  వందేమాతరం అంటే తల్లి ముందు వినమ్రంగా నిలబడి నమస్కరించడం అని అర్థమని.. అందుకే ‘హలో’కి బదులుగా ‘వందేమాతరం’ అని ప్రతిఒక్కరూ అనాలి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్టు మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి సుధీర్‌ ముంగంటివార్‌ అన్నారు. ఆదివారం వార్ధా జిల్లాలో మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి ముంగంటివార్‌ మాట్లాడుతూ.. ప్రజలు ఫోన్‌కాల్స్‌ స్వీకరించేటప్పుడు అవతలి వ్యక్తితో ‘జైభీమ్‌, జైశ్రీరామ్‌’ వంటి పదాలనే కాకుండా కావాలనుకొంటే  తమ తల్లిదండ్రుల పేర్లను చెప్పినా మంచిదేనన్నారు. కాకపోతే ‘హలో’ అని చెప్పకుండా ఉండాలనేదే తమ విజ్ఞప్తి అన్నారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ వంటి నినాదాలను బ్రిటిష్‌ పాలకులు నిషేధం విధించారన్నారు. కానీ ఈ పదం స్వాతంత్య్రోద్యమంలో చేరేలా ఎంతోమందిని ప్రేరేపించడం ద్వారా చివరకు మనకు స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ కూడా వందేమాతరం నినాదానికి మద్దతు పలికారని.. ఆ సమయంలో ఆయన రాసిన కాలమ్‌లో అలా పేర్కొన్నారన్నారు. మహారాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన 850 మంది ముఖ్య వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వం ఆడియోబుక్‌ని రూపొందించనుందని వెల్లడించారు. మహారాష్ట్రటెల్‌తో కలిసి ఆడియోబుక్‌ను తీసుకొస్తామని.. ఇక్కడి ప్రముఖులు, వారి సహకారం గురించి కథనాలు, సమాచారం ఆడియో ఫార్మాట్‌లో అందుబాటులో ఉంచడం ద్వారా ప్రజలు వాటిని ప్రయాణాల్లోనూ వినే సౌలభ్యం ఉంటుందని మంత్రి తెలిపారు.

ఇంకోవైపు, ఈ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వం శనివారం తమ ఉద్యోగులకు రిజల్యూషన్‌ జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు తమ ఫోన్‌లో మాట్లాడేటప్పుడు అవతలి వ్యక్తిని పలకరించేందుకు ‘హలో’ అని కాకుండా ‘వందేమాతరం’ అని అనాలని కోరింది. అయితే, ఇది తప్పనిసరేం కాదని.. వివిధ ప్రభుత్వ శాఖల్లోని అధిపతులు తమ సిబ్బందిని ‘వందేమాతరం’ అనేలా ప్రోత్సహించాలని తీర్మానంలో పేర్కొంది. ‘‘'హలో' అనే పదం పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబిస్తోంది.. అలాగే, ఈ పదానికి నిర్దిష్టమైన అర్థం కూడా ఏమీలేదు. ఈ పదం కేవలం ఒక విధానం మాత్రమే. ఎలాంటి భావోద్వేగాన్ని కలిగించదు. అదే, ‘వందేమాతరం’ అని అవతలి వ్యక్తిని పలకరించడం ద్వారా ఆప్యాయతా భావం పెంపొందుతుంది. అందువల్ల దాన్ని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు క్యాంపెయిన్‌ నిర్వహించాలి’’ అని తీర్మానంలో అధికారులు పేర్కొన్నారు. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts