Ajit Pawar: మహిళా మంత్రి లేని మహారాష్ట్ర.. అసెంబ్లీలో మహిళలపై చర్చ..!

మహారాష్ట్ర (Maharashtra) కేబినెట్‌లో ఒక్క మహిళ కూడా లేరని.. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో మహిళల అంశంపై చర్చించడం దురదృష్టకరమని ఎన్‌సీపీ నేత అజిత్‌ పవార్‌  (Ajit Pawar) పేర్కొన్నారు.

Published : 08 Mar 2023 21:32 IST

ముంబయి: మహారాష్ట్ర (Maharashtra) కేబినెట్‌లో కనీసం ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోవడం దారుణమని అసెంబ్లీలో విపక్ష నేత అజిత్‌ పవార్‌ (Ajit Pawar) విమర్శించారు. ఇటువంటి పరిస్థితుల్లో మహిళలకు సంబంధించిన విధానంపై చర్చించడం దురదృష్టకరమన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సంబంధించి ఓ నూతన విధానంపై స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌ ప్రవేశపెట్టిన తీర్మానంపై మాట్లాడిన అజిత్‌ పవార్‌.. కేబినెట్‌లో మహిళలు లేకపోవడంపై ఏక్‌నాథ్‌ శిందే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

‘సమస్య ఏమిటో నాకు అర్థం కావడం లేదు. మంత్రి మండలిలో  గరిష్ఠంగా 43 మంది మందిని తీసుకోవచ్చు. జనాభాలో 50శాతం మంది మహిళలే ఉన్నారు. కానీ, మహారాష్ట్ర కేబినెట్‌లో మాత్రం కనీసం ఒక్క మహిళా మంత్రి కూడా లేరు’ అని ఎన్‌సీపీ నేత అజిత్‌ పవార్‌ పేర్కొన్నారు. కొత్తగా తీసుకువస్తోన్న నూతన విధానం మహిళలకు సామాజిక భద్రత, ఆర్థిక సాధికారత కల్పించాలన్నారు. మహిళలు నిర్భయంగా మాట్లాడకపోవడం వల్ల గృహహింసకు సంబంధించి చాలా వరకు ఫిర్యాదులు రావడం లేదన్నారు. తాజా విధానం ద్వారా అటువంటి వాటికి పరిష్కారం చూపాలని అజిత్‌ పవార్‌ సూచించారు.

ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేన, భాజపాలు కలిసి జూన్‌ 2022లో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ సమయంలో ముఖ్యమంత్రితో సహా 20మంది మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. కానీ, అందులో ఒక్క మహిళకు కూడా చోటు కల్పించకపోవడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు