Maharashtra Rain: 48గంటల్లో 129మంది మృతి!

మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా పలు చోట్ల చోటుచేసుకున్న వేర్వేరు ఘటనల్లో భారీ ప్రాణనష్టం సంభవించింది. భారీ వర్షాలు, వరదలతో.....

Published : 23 Jul 2021 23:07 IST

ముంబయి: మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో భారీ ప్రాణనష్టం జరిగింది. భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలోని పలుచోట్ల చోటుచేసుకున్న వేర్వేరు ఘటనల్లో  రెండు రోజుల వ్యవధిలోనే  మొత్తంగా 129మంది మృతి చెందినట్టు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. రాయ్‌గఢ్‌ జిల్లాలో మహద్‌ తహసీల్‌ పరిధిలోని తలావి గ్రామంలో కొండచరియలు విరిగి పడి 38మంది మృతిచెందినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో వర్షాల వల్ల సంభవించిన మరణాల్లో అత్యధికం రాయ్‌గఢ్‌, సతారా జిల్లాల్లోనే నమోదైనట్టు తెలిపారు. కొండచరియలు విరిగిపడటంతో పాటు అనేక మంది ప్రజలు వరదనీటిలో కొట్టుకుపోయారని వెల్లడించారు. పశ్చిమ మహారాష్ట్రలోని సతారాలో జరిగిన వేర్వేరు ఘటనల్లో 27 మంది మృతిచెందినట్టు పేర్కొన్నారు. 

అలాగే, మహారాష్ట్రలోని తూర్పు జిల్లాలైన గోండియా, చంద్రాపూర్‌ జిల్లాల్లోనూ కొన్ని మరణాలు నమోదైనట్టు తెలిపారు. రాయ్‌గఢ్‌లో చోటుచేసుకున్న దుర్ఘటనలో 36 మృతదేహాలను వెలికితీసినట్టు సీనియర్‌ పోలీస్‌ అధికారి తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో పాటు స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సతారా జిల్లాలోని అంభేగఢ్‌‌, మీర్గావ్‌ గ్రామాల్లో కూడా గురువారం రాత్రి కొండచరియలు విరిగిపడటంతో ఎనిమిది ఇళ్లు కూరుకుపోయినట్టు సతారా గ్రామీణ ఎస్పీ అజయ్‌ కుమార్‌ బన్సల్‌ వెల్లడించారు. కోస్టల్‌ రత్నగిరి జిల్లాలో కొండచరియలు విరగడంతో వాటికింద 10మంది చిక్కుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని