Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు.. 5 రోజుల్లో 50 కరోనా కేసులు

మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలను కరోనా మహమ్మారి కుదిపేసింది. పలువురు శాసనసభ సిబ్బంది, పోలీసులు కొవిడ్‌ బారిన పడ్డారు. కేవలం 5 రోజుల పాటు

Updated : 29 Dec 2021 17:21 IST

వైరస్‌ సోకిన వారిలో ఇద్దరు మంత్రులు కూడా..

ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలను కరోనా మహమ్మారి కుదిపేసింది. పలువురు శాసనసభ సిబ్బంది, పోలీసులు కొవిడ్‌ బారిన పడ్డారు. కేవలం 5 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో దాదాపు 50 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ వెల్లడించారు. ‘‘శీతాకాల సమావేశాలు జరిగిన 5 రోజుల్లో దాదాపు 50 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇందులో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు’’ అని అజిత్‌ తెలిపారు. 

మహారాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి వర్ష గైక్వాడ్‌ మంగళవారం కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని నిన్న ఆమె ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. తనకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని, పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అయితే సోమవారం వరకు ఆమె అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం గమనార్హం. కాగా.. వర్ష గైక్వాడ్‌ గతేడాది కూడా వైరస్‌ బారినపడ్డారు. 

ఇక మరో మంత్రి కేసీ పాడ్వి, భాజపా ఎమ్మెల్యే సమీర్‌ మేఘేలకు కూడా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరితో పాటు శాసనసభలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు, అక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్న పలువురు పోలీసులకు కూడా కరోనా సోకింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. వారి కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేపట్టి పరీక్షలు చేస్తున్నారు. డిసెంబరు 22 నుంచి మొదలైన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మంగళవారంతో ముగిశాయి. 

మరోవైపు మహారాష్ట్రలో కరోనా కేసులు కూడా నానాటికీ పెరుగుతుండటం కలవరపెడుతోంది. నిన్న 2వేలకు పైగా కొత్త కేసులు నమోదవ్వగా.. 22 మంది మరణించారు. ఇక రాష్ట్రంలో 167 ఒమిక్రాన్‌ కేసులు బయటపడ్డాయి. కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన మహా సర్కారు.. ఇప్పటికే నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని