Maharashtra: మహా సంక్షోభం వేళ.. ఉద్ధవ్‌ ఠాక్రేతో శరద్‌ పవార్‌ భేటీ

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో (Uddhav Thackeray) ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ (Sharad Pawar) భేటీ అయ్యారు.

Published : 24 Jun 2022 20:49 IST

శివసైనికుల ఆందోళన నేపథ్యంలో పోలీసుల అలర్ట్‌

దిల్లీ: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం (Political Crisis) కొనసాగుతూనే ఉంది. శివసేన అసమ్మతి నేతలు అస్సాం నుంచి క్యాంపు రాజకీయాలు నడుపుతుండగా.. ఎన్‌సీపీ, శివసేన (Shiv Sena) నేతలు మహారాష్ట్రలో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో (Uddhav Thackeray) ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ (Sharad Pawar) భేటీ అయ్యారు. ఠాక్రే నివాసం ‘మాతోశ్రీ’కి (Matoshree) పవార్‌తోపాటు ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌, రాష్ట్రమంత్రి జయంత్‌ పాటిల్‌,  పార్టీ నేత ప్రఫుల్‌ పటేల్‌ చేరుకున్నారు. ఇప్పటికే 50 మంది సభ్యుల బలమున్న తమదే అసలైన శివసేన అంటూ రెబల్‌ నేతలు ప్రకటిస్తున్న నేపథ్యంలో.. తదుపరి కార్యాచరణపై పవార్‌, ఠాక్రేలు చర్చలు ముమ్మరం చేశారు.

అంతకుముందు శివసేన జిల్లా అధ్యక్షులతో మాట్లాడిన ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే.. పార్టీని ముక్కలు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అసమ్మతి నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. శివసేనను విడిచిపెట్టడం కంటే మరణించడం మేలని మాట్లాడిన వ్యక్తులు.. ఈ రోజు పార్టీని విడిచి పారిపోయాన్నారు. శివసేన (Shiv Sena), ఠాక్రే పేర్లు వాడకుండా వారెలా ముందుకు వెళ్తారని ప్రశ్నించిన ఉద్ధవ్‌.. తానెప్పుడూ ముఖ్యమంత్రి పదవి గురించి కలగనలేదన్నారు.

మరోవైపు తమకు ఓ జాతీయ పార్టీ సహాయం చేస్తామని చెప్పిన శివసేన రెబల్‌ నేత ఏక్‌నాథ్‌ శిందే తాజాగా మాట మార్చారు. ఏ జాతీయ పార్టీ తమకు కాంటాక్టులో లేదన్నారు. రెబల్‌ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా శివసేన ప్రయత్నాలు చేస్తోందని వస్తున్న వార్తలపై స్పందించిన ఆయన.. మొత్తం 55 మంది శివసేన ఎమ్మెల్యేలకు గానూ 40మంది గువాహటిలో తనతోనే ఉన్నారని చెప్పారు. అలాంటప్పుడు తమపై చర్యలు తీసుకోవడం అసాధ్యమంటూ ఏక్‌నాథ్‌ శిందే స్పష్టం చేశారు.

ఇలా ఇరువర్గాలు తమ వాదనలతో నాలుగు రోజులుగా మహారాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఎన్‌సీపీ, శివసేనలు ప్రయత్నాలు చేస్తుండగా.. శివసేన రెబల్‌ నేతలు క్యాంపు రాజకీయాలతో తమ వ్యూహాల్లో మునిగిపోయారు. ఇదే సమయంలో ముంబయిలో రెబల్‌ ఎమ్మెల్యే  కార్యాలయంపై శివ సైనికులు దాడి చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని