Omicron: మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ బీఏ.4, బీఏ.5 ఉపవేరియంట్ల కలకలం.. ఏడుగురికి పాజిటివ్‌

మహారాష్ట్రలో తాజాగా నాలుగు బీఏ.4 కేసులు, మూడు బీఏ.5 కేసులు నమోదుకావడం కలకలం రేపుతోంది.......

Published : 29 May 2022 01:27 IST

ముంబయి: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ.. ప్రమాదకరమైన ఒమిక్రాన్‌ ఉపవేరియంట్లు వెలుగుచూడటం కలకలం రేపుతోంది. మహారాష్ట్రలో తొలిసారి బీఏ.4, బీఏ.5 కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో తాజాగా నాలుగు బీఏ.4 కేసులు, మూడు బీఏ.5 కేసులు నమోదైనట్టు వైద్యులు ప్రకటించారు. ఒమిక్రాన్‌ ఉపవేరియంట్ల బారిన పడిన ఏడుగురికీ స్వల్ప లక్షణాలే ఉన్నట్లు తెలిపారు. కాగా వీరంతా పుణెకు చెందినవారు కావడం గమనార్హం. వారందరినీ హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వివరించారు. 

‘జీనోమ్ సీక్వెన్సింగ్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నిర్వహించింది. ఈ సీక్వెన్సింగ్‌ను ఫరీదాబాద్‌లోని ఇండియన్ బయోలాజికల్ డేటా సెంటర్ ధృవీకరించింది. ఇందులో పుణెకు చెందిన ఏడుగురు ఒమిక్రాన్ ఉపవేరియంట్ల బారినపడినట్లు నిర్ధరణ అయ్యింది. వీరిలో నలుగురికి బీఏ.4 సోకగా, మరో ముగ్గురు బీఏ.5 ఉప వేరియంట్‌ బారినపడ్డారు. ఈ ఏడుగురిలో ముగ్గురు మహిళలతో పాటు తొమ్మిదేళ్ల బాలుడు కూడా ఉన్నాడు ’ అని అని వైద్యాధికారి పేర్కొన్నారు.

వైరస్‌ బారిన పడినవారిలో  ఇద్దరు విదేశాలకు వెళ్లివచ్చారని, మరో ముగ్గురు ఇతర రాష్ట్రాలకు ప్రయాణించినట్లు అధికారులు వెల్లడించారు. మరో ఇద్దరు మాత్రం ఎక్కడికీ వెళ్లలేదని తెలిపారు. బాలుడు మినహా మిగతా ఆరుగురు కూడా వ్యాక్సినేషన్‌ పూర్తిస్థాయిలో తీసుకున్నారని, ఓ వ్యక్తి బూస్టర్‌ డోసు కూడా తీసుకున్నట్లు పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో వ్యాప్తి చెందిన ఒమిక్రాన్‌ ఉప వేరియంట్లు బీఏ.4, బీఏ.5లు భారత్‌లో గుర్తించినట్లు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం (INSACOG) కొద్దిరోజుల క్రితమే వెల్లడించించిన విషయం తెలిసిందే. తమిళనాడు, తెలంగాణలో ఈ కేసులు ఇప్పటికే బయటపడ్డాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని