Maharashtra: రాజీనామా చేయాలనుకుంటున్నా.. మహారాష్ట్ర గవర్నర్‌ కోశ్యారీ సంచలన ప్రకటన

ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ పదవి నుంచి దిగిపోయేందుకు సిద్ధమయ్యారు. రాజకీయ బాధ్యతల నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు ప్రకటించారు.

Updated : 23 Jan 2023 18:01 IST

ముంబయి: మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్ కోశ్యారీ (Bhagat Singh Koshyari) సంచలన విషయాన్ని ప్రకటించారు. రాజకీయ బాధ్యతల నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తెలిపానని వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో 80 ఏళ్ల  కోశ్యారీ తన గవర్నర్‌ పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.

‘‘సంఘ సంస్కర్తలు, వీర యోధులు పుట్టిన గడ్డ మహారాష్ట్ర (Maharashtra) లాంటి గొప్ప రాష్ట్రానికి రాజ్య సేవకుడి (గవర్నర్‌)గా సేవలందించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఈ మూడేళ్లలో రాష్ట్ర ప్రజల నాపై చూపించిన ప్రేమ, అభిమానాన్ని నేను ఎన్నటికీ మర్చిపోను. ఇటీవల ప్రధాని మోదీ (Modi) ముంబయి పర్యటనకు వచ్చిన సమయంలో ఆయనతో ఓ విషయాన్ని పంచుకున్నా. అన్ని రాజకీయ బాధ్యతల నుంచి వైదొలగాలని అనుకుంటున్నట్లు చెప్పాను. నా శేష జీవితాన్ని పుస్తకాలు చదవడం, రాయడం, ఇతర వ్యాపకాలతో గడపాలనుకుంటున్నా. ప్రధాని మోదీ నాపై ఎప్పుడూ అభిమానం చూపిస్తారు. ఈ విషయంలోనూ అలాగే స్పందిస్తారని ఆశిస్తున్నా’’ అని కోశ్యారీ వెల్లడించారు.

మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కోశ్యారీ అనేకసార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. 2019లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేవేంద్ర ఫడణవీస్‌తో తెల్లవారుజామునే ప్రమాణస్వీకారం చేయించడం, మహా వికాస్‌ అఘాడీ కూటమి ప్రభుత్వం నామినేట్‌ చేసిన 12 మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను తిరస్కరించడం వంటి ఘటనలతో వార్తల్లో నిలిచారు.

ఇటీవల కూడా మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ (Shivaji) మహరాజ్‌పై వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శల పాలైన విషయం తెలిసిందే. శివాజీ మహారాజ్‌ పాతతరం నాయకుడంటూ ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఆయనను వెంటనే రీకాల్‌ చేయాలంటూ మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ, కాంగ్రెస్‌ నేతలు డిమాండ్ చేశాయి. గవర్నర్‌ (Governor)ను తొలగించాలంటూ ప్రతిపక్షాలు ఆందోళన కూడా చేపట్టాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కోశ్యారీ తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని