Maharashtra: మరో జిల్లాకు పేరు మారుస్తూ శిందే సర్కార్‌ ప్రకటన

మహారాష్ట్ర (Maharashtra) ప్రభుత్వం రాష్ట్రంలోని మరో జిల్లా పేరును మారుస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) ఒక ప్రకటన చేశారు. 

Published : 01 Jun 2023 01:04 IST

ముంబయి: మహారాష్ట్ర (Maharashtra)లోని భాజపా-శివసేన (శిందే వర్గం) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అహ్మద్‌నగర్‌ (Ahmednagar) జిల్లా పేరును అహల్యానగర్‌(Ahilya Nagar)గా మారుస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) బుధవారం ఒక ప్రకటన చేశారు. ఇకపై అహ్మద్‌నగర్‌ను అహల్యానగర్‌గా పిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. అహల్యాబాయి హోల్కర్‌ జయంతి సందర్భంగా ఆమె గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు శిందే తెలిపారు. 

అహల్యా బాయి మరాఠాలు పాలించిన మాల్వా సామ్రాజ్యపు హోల్కరు వంశానికి చెందిన రాణి. ఆమె ప్రస్తుత అహ్మద్‌నగర్‌ జిల్లాలోని చౌంధీ (Chaundhi) అనే ఊర్లో జన్మించారు. ‘‘సంఘ సంస్కర్త, మహిళా అభ్యుదయవాదిగా రాణి అహల్యాబాయి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. దేశ వ్యాప్తంగా ఎన్నో దేవాలయాలు, ధర్మశాలలు నిర్మించారు. ఆమె లేకుంటే మనకు ఈరోజు కాశీలో మహాశివుడి గుడి ఉండేది కాదు. అందుకే అహ్మద్‌నగర్‌కు ఆమె పేరు పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు’’ అని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ (Devendra Fadnavis) అన్నారు. ప్రజల తరపు తాను కూడా సీఎం శిందేకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఔరంగాబాద్, ఉస్మానాబాద్‌ జిల్లాల పేర్లను కూడా భాజపా-శివసేన (శిందే వర్గం) ప్రభుత్వం మార్చింది. దీనికి ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది అయితే, ఔరంగాబాద్‌ పేరును ఛత్రపతి శంభాజీ నగర్‌గా, ఉస్మానాబాద్ పేరును ధారాశివ్‌గా మహారాష్ట్ర ప్రభుత్వం మార్చిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని