Maharashtra: ‘డెల్టా ప్లస్‌’తో థర్డ్‌వేవ్‌ ముప్పు..!

ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించకపోతే  రాష్ట్రంలో డెల్టా ప్లస్‌తో థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉందని మహారాష్ట్ర ఆరోగ్య అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే సెకండ్‌ వేవ్‌కు రెట్టింపుగా కేసులు నమోదవ్వచ్చని మహరాష్ట్ర కొవిడ్‌-19 టాస్క్‌ ఫోర్స్‌, వైద్య నిపుణులు హెచ్చరించారు.

Updated : 17 Jun 2021 13:46 IST

అప్రమత్తంగా ఉండాలన్న మహారాష్ట్ర ప్రభుత్వం

ముంబయి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ ‘డెల్టా ప్లస్‌’ వేరియంట్‌తో థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉందని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే సెకండ్‌ వేవ్‌కు రెట్టింపు సంఖ్యలో కేసులు వస్తాయని మహరాష్ట్ర కొవిడ్‌-19 టాస్క్‌ ఫోర్స్‌, వైద్య నిపుణుల బృందం హెచ్చరించింది. ఈ మేరకు నివేదికలను ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు సమర్పించినట్లు వైద్యాధికారులు తెలిపారు. ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటే సెకండ్ వేవ్‌ ముగియక ముందే థర్డ్‌ వేవ్‌ వచ్చే ప్రమాదముందని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. సెరో సర్వే, వ్యాక్సిన్‌ పంపిణీలను వేగవంతం చేయాలని వారు సూచించారు.

వైద్య నిపుణుల సూచనలతో అన్ని ప్రాంతాల్లో ఔషధాలు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో క్రియాశీల కేసుల్లో 10 శాతం మంది చిన్నారులేనని అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలో కరోనా ఫస్ట్‌ వేవ్ సమయంలో 19 లక్షల మంది వైరస్‌కు గురికాగా, సెకండ్‌ వేవ్‌లో ఆ సంఖ్య 40 లక్షలకు చేరిందని తెలిపారు. మరణాల రేటు కూడా గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు.

‘‘కరోనా ఫస్ట్‌ వేవ్‌లో తగినన్ని సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడ్డాం. తరువాత ఆ లోపాలను సవరించుకొని సెకండ్‌వేవ్‌ను ఎదుర్కొంటున్నాం. ఔషధాలు, ఆరోగ్య సౌకర్యాలు, ఆక్సిజన్‌ అన్ని అందుబాటులో ఉన్నాయి. కానీ, ప్రజలు తమ వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోతే తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది’’ అని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. రెండు, మూడు నెలల్లో వ్యాక్సిన్‌ కొరతను కూడా అధిగమిస్తామని ఉద్ధవ్‌ హామీ ఇచ్చారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేస్తే కరోనాను కట్టడి చేయవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపు ప్రారంభమైంది. రెస్టారెంట్లు, దుకాణాలు తెరచుకున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని