Maharashtra-Karnataka: సరిహద్దులో పరిస్థితులు ఆందోళనకరం.. కర్ణాటకకు శరద్‌ పవార్‌ అల్టిమేటం

కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు వివాదం మరింత ముదురుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా అక్కడ వాహనాలపై దాడులు జరగడంపై స్పందించిన ఎన్‌సీపీ నేత శరద్‌ పవార్‌.. 24గంటల్లో పరిస్థితులను అదుపులోకి తేకుండా తాము దీటుగా స్పందిస్తామని హెచ్చరించారు.

Published : 07 Dec 2022 01:08 IST

ముంబయి: మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు వివాదం (Border Dispute) మరింత ముదురుతున్నట్లు కనిపిస్తోంది. ఈ అంశంపై ఇరు రాష్ట్రాల నేతలు ప్రకటనలు చేసుకోవడం దీనికి మరింత ఆజ్యం పోస్తోంది. ఇదే సమయంలో సరిహద్దులో కొన్ని వాహనాలపై దాడులు చేయడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో సరిహద్దులో ఆందోళనకర పరిస్థితులకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై (Basavaraj Bommai) కారణమని ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఆరోపించారు. మహారాష్ట్ర నుంచి కర్ణాటకలోకి (Karnataka) ప్రవేశించే వాహనాలపై దాడులు ఆపకుంటే మరో విధంగా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు.

‘సరిహద్దులో నెలకొన్న పరిస్థితులను గమనించిన మహారాష్ట్ర (Maharashtra).. దీనిపై సహనంతో ఉండాలని నిర్ణయించింది. కానీ, దానికీ ఓ హద్దు ఉంటుంది. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. వాహనాలపై దాడులు ఆపకుంటే ఆ సహనం వేరే మార్గాన్ని ఎంచుకుంటుంది. ఒకవేళ సరిహద్దులో శాంతిభద్రతలు క్షీణిస్తే అందుకు పూర్తి బాధ్యత కర్ణాటక ముఖ్యమంత్రి, ఆ ప్రభుత్వానిదే. కేంద్రం కూడా ప్రేక్షకపాత్ర వహించొద్దు’ అని ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ స్పష్టం చేశారు. సరిహద్దులో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ వివాదంపై నిర్ణయం తీసుకునే సమయం వచ్చిందన్న ఆయన.. అక్కడ శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు మహారాష్ట్ర ఎంపీలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలువనున్నట్లు చెప్పారు.

ఇదిలాఉంటే, సరిహద్దు ప్రాంతంలో ఉన్న కన్నడ, మరాఠి మాట్లాడే గ్రామాలు తమకే చెందినవంటూ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన నేతలు ఇటీవల ప్రకటనలు చేయడం తాజా వివాదానికి తెరలేపింది. తాజాగా మహారాష్ట్ర మంత్రులు కర్ణాటకలోకి ప్రవేశించకుండా నిషేధిస్తూ బెళగావి జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలపై రాళ్లు రువ్వి దాడి చేయడంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని