Maharashtra: మామ మండలి ఛైర్మన్‌.. అల్లుడు అసెంబ్లీ స్పీకర్‌

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శాసనమండలి, అసెంబ్లీ స్పీకర్‌గా మామ, అల్లుడు ఎన్నికై రికార్డు సృష్టించారు.

Published : 03 Jul 2022 15:33 IST

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం

ముంబయి: మహారాష్ట్ర రాజకీయాల్లో (Maharashtra Politics) కీలక పరిణామం చోటుచేసుకుంది. శాసనమండలి, అసెంబ్లీ స్పీకర్‌గా మామ, అల్లుడు ఎన్నికై రికార్డు సృష్టించారు. శిందే వర్గం మద్దతుతో స్పీకర్‌గా ఎన్నికైన భాజపా నేత రాహుల్‌ నర్వేకర్‌ (Rahul Narvekar).. మండలి ఛైర్మన్‌గా రామ్‌రాజే నాయక్‌ (Ramraje Naik)కు స్వయానా అల్లుడు. అయితే, మామ మాత్రం ఎన్‌సీపీ (నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ)కి చెందిన వ్యక్తి కాగా.. అల్లుడు మాత్రం భాజపా నేత కావడం విశేషం.

మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌ నర్వేకర్ (45) ఈ పదవిని చేపట్టిన పిన్న వయస్కుడని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ పేర్కొన్నారు. ముంబయిలోని కొలాబా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాహుల్ నర్వేకర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, శివసేన యూత్‌ విభాగం అధికార ప్రతినిధిగా ఉన్న ఆయన.. 2014లో పార్టీని వీడి ఎన్‌సీపీలో చేరారు. శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే దూరం పెట్టడం వల్లే పార్టీని వీడిపోతున్నట్లు అప్పట్లో పేర్కొన్నారు. 2014లో మవాలా అసెంబ్లీ నుంచి పోటీ చేసిన నర్వేకర్‌.. శివసేన అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. అనంతరం 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు భాజపాలో చేరి.. కొలాబా స్థానం నుంచి గెలుపొందారు. తాజాగా ఏక్‌నాథ్‌ శిందే, భాజపా మద్దతుతో అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. నర్వేకర్ సోదరుడు మాత్రం ప్రస్తుతం కొలాబా కార్పొరేటర్‌గా కొనసాగుతున్నారు.

ఇదిలాఉంటే, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏక్‌నాథ్‌ శిందే.. అసెంబ్లీలో బలనిరూపణకు సిద్ధమయ్యారు. ఇందుకు సోమవారం ముహూర్తం ఖరారయ్యింది. అంతకుముందే శివసేన రెబల్‌ నేతల మద్దతుతో భాజపా నేత స్పీకర్‌గా ఎన్నిక కావడం ఏక్‌నాథ్‌ శిందే బలనిరూపణలో గెలుపు ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని