Omicron: గుండెపోటుతో చనిపోయిన వ్యక్తిలో ఒమిక్రాన్‌ గుర్తింపు..!

దేశంలో కొత్త వేరియంట్‌ కారణంగా తొలి మరణం నమోదైందా..? మహారాష్ట్రలో గుండెపోటుతో చనిపోయిన ఓ 52 ఏళ్ల వ్యక్తికి అంతకు ముందు చేసిన పరీక్షల్లో ఒమిక్రాన్‌

Published : 31 Dec 2021 12:54 IST

ముంబయి: దేశంలో కొత్త వేరియంట్‌ కారణంగా తొలి మరణం నమోదైందా..? మహారాష్ట్రలో గుండెపోటుతో చనిపోయిన ఓ 52 ఏళ్ల వ్యక్తికి అంతకు ముందు చేసిన పరీక్షల్లో ఒమిక్రాన్‌ సోకినట్లు తేలింది. దీంతో కొత్త వేరియంట్‌ కారణంగా దేశంలో తొలి మరణం నమోదైనట్లు పలువురు పేర్కొంటున్నప్పటికీ.. ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం అంగీకరించట్లేదు. 

మహారాష్ట్రలోని పుణె శివారు ప్రాంతానికి చెందిన 52ఏళ్ల వ్యక్తి కొద్ది రోజుల క్రితం నైజీరియాలో పర్యటించి వచ్చారు. ఇటీవల అనారోగ్యానికి గురవడంతో పంప్రీ-ఛించ్వాడ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ యుశ్వంత్‌రావ్‌ చవాన్‌ ఆసుపత్రిలో చేరారు. డిసెంబరు 28న ఆ వ్యక్తి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. అయితే అంతకుముందు ఆయనకు కరోనా జీనోమ్‌ పరీక్షలు నిర్వహించారు. ఆ ఫలితాలు గురువారం వచ్చాయి. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ రిపోర్ట్‌లో ఆయనకు ఒమిక్రాన్‌ నిర్ధారణ అయినట్లు మహారాష్ట్ర పబ్లిక్ హెల్త్‌ విభాగం బులిటెన్ వెల్లడించింది. ఆయన మృతికి కొవిడ్‌ కారణం కాదని, యాదృచ్ఛికంగా పరీక్షల్లో ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా తేలిందని ఆరోగ్యశాఖ అధికారులు బులిటెన్‌లో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 198 కొత్త వేరియంట్‌ కేసులు వెలుగుచూశాయి. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలోనే 450 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. కాగా.. ఇందులో దాదాపు 150 మందికి ఇటీవల కాలంలో అంతర్జాతీయ ప్రయాణాలతో సంబంధం లేకపోవడం గమనార్హం. మరోవైపు రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 5,368 కొత్త కేసులు నమోదయ్యాయి. 

ఇక దేశంలో ఒమిక్రాన్ ఉద్ధృతి పెరుగుతుండటంతో ఆ ప్రభావం కరోనా కేసులపై స్పష్టంగా కన్పిస్తోంది. గత కొన్ని రోజులుగా 10 వేలకు దిగువనే నమోదవుతున్న కేసులు.. తాజాగా 16 వేలకుపైగా చేరాయి. మరోవైపు ఒమిక్రాన్‌ కేసులు కూడా భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నిన్న ఒక్కరోజే 16,764 కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1270కి పెరిగింది. ఒక్క రోజులోనే కొత్త వేరియంట్‌ కేసులు 30 శాతం మేర పెరిగాయి. వేగంగా విస్తరిస్తోన్న ఈ వేరియంట్.. 23 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు వ్యాపించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని