Maharashtra: వేడెక్కిన ‘మహా’ రాజకీయం.. క్రాస్‌ ఓటింగ్‌ భయంతో రిసార్టులకు ఎమ్మెల్యేలు!

మహారాష్ట్రలో శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలకు క్రాస్‌ ఓటింగ్‌ భయం పట్టుకుంది. దీంతో తమ ఎమ్మెల్యేలను ప్రత్యేక ప్రాంతాలకు తరలించాయి. 

Published : 11 Jul 2024 18:00 IST

ముంబయి: మహారాష్ట్ర (Maharashtra) రాజకీయం మరోసారి వేడెక్కింది. తాజాగా పలు శాసన మండలి స్థానాలకు జరగనున్న ఎన్నికలు ఇందుకు వేదికైంది. శుక్రవారం ఓటింగ్‌ నేపథ్యంలోనే ప్రధాన పార్టీల్లో క్రాస్‌ ఓటింగ్ భయం నెలకొంది. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన పార్టీలు.. రిసార్టు రాజకీయానికి తెరతీశాయి. తమ ఎమ్మెల్యేలను ప్రత్యేక ప్రాంతాలకు తరలించాయి. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ తాజాగా మండలి ఎన్నికలు ఆసక్తిగా మారాయి.

క్రాస్‌ ఓటింగ్‌ భయం నేపథ్యంలో శివసేన (యూబీటీ), ఏక్‌నాథ్‌ శిందే వర్గాలు తమ ఎమ్మెల్యేలను రిసార్టులు, లగ్జరీ హోటళ్లకు తరలించినట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే తమ పార్టీ ప్రజాప్రతినిధులను హోటళ్లకు తీసుకెళ్తున్నారు. రాత్రివేళల్లో పార్టీ అగ్రనేతలతో మంతనాలు జరుపుతున్నారు. రెండేళ్ల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో క్రాస్‌ ఓటింగ్‌ కారణంగానే ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని ఎంవీకే (మహా వికాస్‌ అఘాడీ) ప్రభుత్వం కూలిపోయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, శివసేనలో చీలికకూ దారితీసింది. దీంతో తాజా ఎన్నికలతో ప్రధాన పార్టీలు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.

హోటల్‌ బుక్‌ చేయని శరద్‌ పార్టీ.. 

శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) మాత్రం తమ నేతల కోసం ఎలాంటి హోటళ్లను బుక్‌ చేయకపోవడం ఆసక్తికరంగా మారింది. ప్రత్యేకంగా ఎటువంటి సంప్రదింపులు, సమావేశాలు కూడా నిర్వహించలేదని తెలుస్తోంది. మరోవైపు, ఓటింగ్‌ విధానం గురించి ఎమ్మెల్యేలకు వివరించేందుకు దిల్లీ నుంచి కాంగ్రెస్‌ నేతలు రానునున్నట్లు సమాచారం.

అంబానీల ఇంట పెళ్లి సందడి : అతిథులను తరలించేందుకు 3 ఫాల్కన్‌ జెట్‌ విమానాలు

రాష్ట్రంలోని 11 శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరగనుండగా వీటి కోసం 12 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇద్దరు అభ్యర్థులు గెలుపునకు అవసరమయ్యే మెజార్టీ ఎంవీఏకు ఉన్నప్పటికీ మూడో అభ్యర్థిని నిలబెట్టడం ఆసక్తికరంగా మారింది. ఇతర పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపిన శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్‌ ఠాక్రే.. మిలింద్‌ నార్వేకర్‌తో నామినేషన్‌ వేయించారు. మూడో స్థానంలోనూ గెలుపొందేందుకు అవసరమైన ఓట్ల కోసం ఎంవీఏ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని