Maharashtra: మహిళా పోలీసుల పనివేళలు తగ్గింపు

మహారాష్ట్రలో మహిళా పోలీసుల పనివేళలు తగ్గిస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ సంజయ్‌ పాండే వెల్లడించారు

Published : 24 Sep 2021 22:49 IST

ముంబయి: మహారాష్ట్రలో మహిళా పోలీసుల పనివేళలు తగ్గిస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ సంజయ్‌ పాండే వెల్లడించారు. ఇప్పటివరకు ఉన్న 12 గంటల వ్యవధిని 8 గంటలకు కుదించినట్లు తెలిపారు. ఈ విధానం ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అమల్లో ఉందని.. మరికొన్ని ప్రాంతాల్లోనూ విడతల వారీగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పనిగంటల విధానం కుటుంబంపై ప్రభావితం చేస్తుందని ఈ విధానాన్ని మార్చాలని ఇటీవల పలువురు మహిళా కానిస్టేబుల్స్‌ డీజీపీని కలిసి విన్నవించారు. దీనిపై ఉన్నతాధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, మహిళా పోలీసులు ఎనిమిది గంటలు పనిచేసే విధానం ఇప్పటికే నాగ్‌పూర్‌, పుణె, అమరావతి, నవీ ముంబయిలో అమలులో ఉందని సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. రాష్ట్రంలోని ఈ నాలుగు మెట్రోపాలిటన్ నగరాల్లో ఈ విధానం బాగా పనిచేసిందని పేర్కొన్నారు. దీనివల్ల అధిక సంఖ్యలో పోలీసు సిబ్బంది అవసరమవుతారన్నారు. ఎనిమిది గంటల పని విధానాన్ని వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

కాగా, దీనిపై ఎన్‌సీపీ నేత, ఎంపీ బారామతి సుప్రియా సూలే ట్వీట్‌ చేశారు. ‘‘మహారాష్ట్ర ప్రభుత్వం మహిళా పోలీసుల పనివేళలను 12గంటలు నుంచి 8గంటలకు తగ్గించి తీసుకున్న నిర్ణయం హర్షనీయమైంది. మహిళలు కుటుంబాన్ని, డ్యూటీని సమన్వయం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, రాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే-పాటిల్‌కు ప్రత్యేక ధన్యవాదాలు’’అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని