మహారాష్ట్రలో ఆగని కొవిడ్‌ ఉద్ధృతి! 

మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి ఆగడంలేదు. రోజురోజుకీ పెరుగుతున్న కొత్త కేసులతో రాష్ట్రం ఉక్కిరిబిక్కిరవుతోంది. కరోనా టీకాల కొరతతో ఇప్పటికే .....

Updated : 09 Apr 2021 22:55 IST

ముంబయి: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి ఆగడంలేదు. రోజురోజుకీ పెరుగుతున్న కొత్త కేసులతో రాష్ట్రం ఉక్కిరిబిక్కిరవుతోంది. కరోనా టీకాల కొరతతో ఇప్పటికే పలు వ్యాక్సిన్ కేంద్రాలు మూతపడుతుండగా.. మరికొన్ని చోట్ల ఆస్పత్రుల్లో పడకల కొరతతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత కొన్ని వారాలుగా భారీ సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో జనం తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో గడిచిన 24గంటల్లో మరో 59వేల కొత్త కేసులు రావడం అక్కడి వైరస్‌ తీవ్రతకు అద్దంపడుతోంది.

గడచిన 24గంటల వ్యవధిలో మహారాష్ట్రలో 58,993 కొత్త కేసులు, 301 మరణాలు నమోదయ్యాయి. అలాగే, మరో 45,391మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. తాజా గణాంకాలతో కలిపితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 2,16,31,258 శాంపిల్స్‌ పరీక్షించగా.. 32,88,540మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 26,95,148మంది కోలుకోగా.. 57,329మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 5,34,603 క్రియాశీల కేసులు ఉన్నాయి.

లాక్‌డౌన్‌ పెడతారా?
మరోవైపు, కరోనా ఉద్ధృతి వేళ శనివారం అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని భాజపా నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత ప్రవీణ్‌ దారేకర్‌ వెల్లడించారు. కొవిడ్‌ విజృంభణ రోజురోజుకీ పెరిగిపోతున్న వేళ ప్రభుత్వంలోని మంత్రుల నుంచే పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ పెట్టాలన్న ప్రతిపాదనలు వస్తున్నాయి.  రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకొని కరోనా కట్టడే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించాలని తాను ప్రతిపాదించినట్టు మహారాష్ట్ర మంత్రి విజయ్‌ వడెట్టివార్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మరోసారి పూర్తి లాక్‌డౌన్‌ పెట్టే అంశంపై రేపు నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని