Maternity Leave: ఆ యూనివర్సిటీలో.. విద్యార్థినులకు మాతృత్వ సెలవులు..

పెళ్లి, పిల్లలు వంటి బంధాలను కొనసాగిస్తూనే చదువుకోవాలనుకునే అమ్మాయిలకు కేరళ యూనివర్సిటీ శుభవార్త చెప్పింది. విద్యార్థినులకు 60 రోజుల మాతృత్వ సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

Published : 24 Dec 2022 17:14 IST

కొట్టాయం: సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు మాతృత్వ సెలవులు (maternity leave)  ఇస్తారు. అమ్మతనాన్ని ఆస్వాదించడంతో పాటు తమ పిల్లల సంరక్షణ కోసం ఈ సెలవులు ఎంతో ఉపయోగపడుతాయి. కొన్ని సంస్థలు పురుష ఉద్యోగులకు కూడా పితృత్వ సెలవులను కల్పిస్తున్నాయి. కానీ, దేశంలోనే తొలిసారి కాలేజీలో చదివే విద్యార్థినులకు మాతృత్వ సెలవులు ఇవ్వాలని నిర్ణయించిందో యూనివర్సిటీ (University). గర్భంతో ఉన్న విద్యార్థినుల చదువులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

కేరళ (Kerala) కొట్టాయంలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (Mahatma Gandhi University)లో డిగ్రీ, పీజీ విద్యార్థినులకు 60 రోజుల మాతృత్వ సెలవులు ఇవ్వనుంది. ఈ మేరకు యూనివర్సిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. గర్భం దాల్చిన విద్యార్థినులు ఈ సెలవులను ప్రసవానికి ముందు లేదా తర్వాత తీసుకోవచ్చు. అయితే.. తొలి లేదా రెండో కాన్పుకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయి. అంతేగాక, కోర్సులో ఒకసారి మాత్రమే వీటిని ఉపయోగించుకోవాలి. ఇక, గర్భస్రావం (abortion), ట్యూబెక్టమీ (tubectomy) కేసుల్లో 14 రోజులు మంజూరు చేయనున్నట్లు యూనివర్సిటీ వెల్లడించింది.

గర్భాధారణ కారణంగా విద్యార్థినుల చదువులకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. సెమిస్టర్‌ మధ్యలో మాతృత్వ సెలవులు (maternity leave) తీసుకున్న విద్యార్థినులు ఆ తర్వాత పరీక్షలు రాసేందుకు అనుమతించనున్నట్లు తెలిపాయి. దీనివల్ల ఆ విద్యార్థినులు సెమిస్టర్‌ను నష్టపోకుండా ఉంటారని విశ్వవిద్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని