ఆ గాయం మళ్లీ గుచ్చుతోంది.. న్యాయానికి ముగింపు ఇలానా..?

‘20 ఏళ్ల కిందట నేను అనుభవించిన నొప్పి మళ్లీ నన్ను బాధిస్తోంది’ అని బిల్కిస్‌ బానో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 06 Sep 2022 15:29 IST

గాంధీ నగర్: ‘20 ఏళ్ల కిందట నేను అనుభవించిన వేదన మళ్లీ నన్ను బాధిస్తోంది’ అని బిల్కిస్‌ బానో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 2002 నాటి గోద్రా అనంతర అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం సహా ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని దారుణంగా హత్య చేసిన దోషులు జైలు నుంచి ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. దీనిపై బిల్కిస్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాన్ని దూరం చేసి, భయం లేకుండా, ప్రశాంతతలో జీవించే హక్కును ప్రసాదించండంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆమె అభ్యర్థించారు.

‘రెండు రోజుల క్రితం ఆగస్టు 15న.. నేను విన్న వార్తతో 20 ఏళ్ల నాడు నేను అనుభవించిన బాధ నా కళ్ల ముందు కదలాడింది. నా కుటుంబాన్ని, నా జీవితాన్ని సర్వనాశనం చేసి, నా మూడేళ్ల కుమార్తెను దూరం చేసిన 11 మంది దోషులు విడులయ్యారని తెలిసి.. ఆనాడు నాకు తగిలిన గాయం మళ్లీ తిరగబెట్టింది. ప్రభుత్వ నిర్ణయంతో నా మెదడు మొద్దుబారిపోయింది. న్యాయానికి ఇలాంటి ముగింపు ఎలా ఉంటుంది? ఈ దేశంలోని అత్యున్నత న్యాయవ్యవస్థను నేను నమ్మాను. ఈ దేశ వ్యవస్థను నమ్మాను. అందుకే నేను అనుభవించిన బాధను అలవాటు చేసుకుంటూ జీవించడం ప్రారంభించాను’

‘వారి విడుదల నా ప్రశాంతతను దూరం చేసింది. న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసింది. ఇప్పుడు నేను అనుభవిస్తోన్న బాధ నా ఒక్కదానిదే కాదు. కోర్టుల్లో న్యాయం కోసం పోరాడుతోన్న ప్రతి మహిళది. ఇంతపెద్ద నిర్ణయం తీసుకునేముందు నా భద్రత గురించి ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ఈ ప్రమాదాన్ని నా నుంచి దూరం చేయమని గుజరాత్ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను. భయం లేకుండా, ప్రశాంతంగా జీవించే హక్కును నాకు తిరిగి ఇవ్వండని కోరుతున్నాను. నాకు, నా కుటుంబానికి ఎలాంటి హాని లేదని దయచేసి భరోసా కల్పించండి’ అంటూ తన ఆవేదనను వెళ్లగక్కారు.

ఏంటీ కేసు నేపథ్యం..

2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో అల్లర్లు జరిగినప్పుడు ఈ అత్యాచార ఘటన చోటుచేసుకుంది. బిల్కిస్‌ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. కాగా దోషులుగా వారు 15ఏళ్లు కారాగారంలో గడిపారు.

అనంతరం తనను విడుదల చేయాలంటూ వారిలో ఓ వ్యక్తి సుప్రీం కోర్టును ఆశ్రయించగా, అతడి విజ్ఞప్తిని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కేసులో నిందితులందరికీ రెమిషన్‌ మంజూరు చేయాలని కమిటీ సభ్యులు సిఫార్సు చేశారు. ఈ మేరకు వారి విడుదలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని పేర్కొంటూ గోద్రా సబ్‌ జైలు నుంచి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. దీనిపై బిల్కిస్‌ భర్త తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఏ విషయం ఆధారంగా ప్రభుత్వం వారిని విడుదల చేసిందో అర్థం కావడం లేదన్నారు. 

ఈ విడుదలపై దేశం ఒక నిర్ణయానికి రావాలి: మహువా మొయిత్రా

సామూహిక అత్యాచార, హత్యకు పాల్పడిన దోషులను విడుదల చేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత మహువా మొయిత్రా గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. ‘బిల్కిస్‌ బానో ఒక మహిళా లేక ఒక మతవర్గానికి చెందిన వ్యక్తా అనేది ఈ దేశం నిర్ణయించుకోవడం మంచిది’ అని ఘాటుగా స్పందించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని