Mahua Moitra: టీఎంసీకి మహువా మొయిత్రా గుడ్‌బై..?

తృణమూల్ కాంగ్రెస్‌(TMC)కు మహువా మొయిత్రా(Mahua Moitra) గుడ్‌బై చెప్పనున్నారా..? మహువా, పార్టీ మధ్య తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది.

Updated : 06 Jul 2022 12:04 IST

పార్టీ ట్విటర్ ఖాతాను అన్‌ఫాలో చేసిన నేత

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్‌(TMC)కు మహువా మొయిత్రా(Mahua Moitra) గుడ్‌బై చెప్పనున్నారా..? మహువా, పార్టీ మధ్య తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది. పార్టీ అధికారిక ట్విటర్(Twitter ) ఖాతాను అన్‌ఫాలో చేయడం ఈ వార్తలకు కారణంగా కనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే..?

మంగళవారం జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ మహువా మతపరమైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దర్శకురాలు, రచయిత్రి, నటి లీనా మణిమేగలై తన తాజా చిత్రం ‘కాళీ’కి సంబంధించి ఇటీవల విడుదల చేసిన పోస్టర్‌ తీవ్ర వివాదాస్పదంగా మారింది. దానిపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఆ వ్యాఖ్యలు చేశారు. వాటిపై తీవ్ర విమర్శలకు వ్యక్తం అయ్యాయి. సొంత పార్టీ కూడా ఆమె మాటలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వాటితో తమకూ ఏ సంబంధం లేదంటూ దూరం జరిగింది. ‘చర్చా కార్యక్రమంలో ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయం పూర్తిగా ఆమె వ్యక్తిగతం. దానికి పార్టీతో ఎలాంటి సంబంధం లేదు. తృణమూల్ కాంగ్రెస్‌ ఆ తరహా వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తోంది’ అంటూ పార్టీ ట్వీట్ చేసింది. ఈ క్రమంలోనే పార్టీ అధికారిక ట్విటర్ ఖాతాను ఆమె అన్‌ఫాలో చేసింది. అయితే టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఖాతాను మాత్రం అనుసరిస్తున్నారు. 

తన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం కావడంతో మహువా స్పందించారు. తాను ఏ చిత్రానికి, ఏ పోస్టర్‌కు మద్దతు ఇవ్వలేదన్నారు. తాను ధూమపానం అనే పదాన్ని వాడలేదని వివరణ ఇచ్చారు. మహువా ప్రస్తుతం క్రిష్ణానగర్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్లమెంట్‌లో అయినా.. సామాజిక మాధ్యమాల వేదికల్లో అయినా తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు వెల్లడిస్తారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని