Mahua Moitra: బీఫ్‌ తరలింపునకు పాస్‌లు జారీ.. కేంద్ర మంత్రిపై ఎంపీ మహువా ఆరోపణలు

కేంద్రమంత్రి శాంతనూ ఠాకూర్‌ ఇండో - బంగ్లా సరిహద్దులో అక్రమంగా గొడ్డు మాంసం తరలించేందుకు అధికారికంగా పాస్‌లు అందజేస్తున్నారని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు. 

Published : 08 Jul 2024 23:48 IST

కోల్‌కతా: కేంద్రమంత్రి శాంతనూ ఠాకూర్‌ (Union Minister Shantanu Thakur)పై తృణమూల్‌ కాంగ్రెస్‌ (Trinamool Congress) ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) ఎక్స్‌ వేదికగా అక్రమ మాంసం రవాణాపై ఆరోపణలు గుప్పించారు. భారత్‌ - బంగ్లా సరిహద్దుల్లో గొడ్డు మాంసాన్ని అక్రమంగా తరలించేందుకు ఆయన అధికారికంగా పాస్‌లు అందజేస్తున్నారని ఆరోపించారు. 3 కిలోల బీఫ్‌ని తరలించేందుకు 85వ బీఎస్‌ఎఫ్‌ బెటాలియన్‌కు అనుమతిస్తూ రాసిన అధికార పత్రానికి సంబంధించిన ఫొటోను ఆమె ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేశారు. హోంమంత్రిత్వ శాఖ అధికారిక ఎక్స్‌ ఖాతా, బీఎస్‌ఎఫ్‌, గో రక్షక సేనాను ట్యాగ్‌ చేశారు. 

ఈ ఆరోపణలపై ఠాకూర్‌ స్పందిస్తూ ‘ఆ అధికారిక పత్రం ఇండో- బంగ్లా సరిహద్దుల్లోని పౌరులు వివిధ వస్తువులను తరలించేందుకు జారీ చేసినవి. స్మగ్లర్లకు కోసం ఈ పాస్‌లు జారీ చేయలేదు. మహువా ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ రాజకీయ కుట్రలకు తెరలేపుతున్నారు. ఆమెకు ఇటువంటి స్థానిక విషయాలపై అవగాహన లేదు. టీఎంసీ పార్టీ సైతం సరిహద్దుల్లో నివసించే ప్రజలకు ఇటువంటి అధికారిక పత్రాలు జారీ చేస్తుంది. ఆ నిజాలు ఎందుకు దాస్తున్నారు?’ అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. అంతర్జాతీయ సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్‌ చెక్‌పాయింట్ల వద్ద సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు ఇలాంటి పత్రాలు జారీ చేస్తారని పేర్కొన్నారు. ‘ఆ ప్రాంతంలో చాలా మంది మైనారిటీలు నివశిస్తుంటారని, వారిని బీఫ్‌ తినకుండా నేను ఆపలేను’ అని కేంద్ర మంత్రి ఠాకూర్‌ పేర్కొన్నారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని